వీసాల క‌ష్టాలు...బ్రిట‌న్ కూడా చేరిపోయింది

Update: 2017-04-04 14:32 GMT
భారతీయ నిపుణుల‌కు మ‌రో దుర్వార్త‌. ఇటీవ‌ల మేథోవ‌ల‌స‌ల‌ను న‌మ్ముకున్న భార‌త దేశ నిపుణుల‌కు దెబ్బ‌మీద దెబ్బ ప‌డుతున్న జాబితాకు చెందింది ఇది. అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప‌గ్గాలు చేప‌ట్టడ‌మే ఆల‌స్యం వీసాలపై కఠిన నిబంధనలు విధించే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ జాబితాలో మొన్న మలేషియా - ఆ త‌ర్వాత సింగ‌పూర్ చేరాయి. తాజాగా బ్రిటన్ సైతం ఈ జాబితాలో చేరింది. కీల‌క రంగాలైన  ఐటీ - హెల్త్ - ఎడ్యుకేషన్ తదితర రంగాల ప్రొఫెషనల్స్ కు వీసాలు జారీ చేసే విషయంలో బ్రిటన్ సరికొత్త ప్రతిబంధకాలను విధించనుంది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్ స్వతంత్ర ఆర్థిక శక్తిగా నిలబడాలంటే ఉద్యోగాల్లో అధిక భాగం స్థానికులకే దక్కాలన్నది అక్కడి ప్రభుత్వ ఆలోచన. అందుకే, ఏప్రిల్ 6 నుంచి వలసదాల నుంచి వసూలయ్యే పన్నుల ద్వారా నిధిని ఏర్పాటుచేసింది. స‌ద‌రు నిధిలో నుంచి అధిక మొత్తాన్ని బ్రిటిషర్లకు ఉద్యోగాల కల్పన కోసం పనిచేసే సంస్థలకు ప్రోత్సాహకాలుగా ఇవ్వనున్నారు. విదేశాల‌కు చెంది ఉండి బ్రిటన్ లోని ఆయా సంస్థల్లో పనిచేస్తూ, ఎక్కువ మొత్తంలో వేతనాలు పొందే వలస ఉద్యోగుల నుంచి ఇమిగ్రేషన్ స్కిల్ చార్జీలు, హెల్త్ సర్ చార్జీలు తదితర రూపాల్లో ఏటా 200 పౌండ్ల నుంచి 1000 పౌండ్ల దాకా వసూలు చేయనున్నారు. అలాగే ఇంటర్ కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ)పై బ్రిటన్ లో పనిచేసేందుకు వచ్చే ప్రొఫెషనల్స్ , టైర్ 2, డిపెండెంట్ వీసాలపై కూడా ఇదే తరహాలో బాదుడు ఉండబోతోంది. దీంతోపాటుగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ లోనూ మరికొన్ని నిబంధనలు చేర్చారు. ఏప్రిల్ 6(గురువారం) నుంచే ఈ నూతన నిబంధనలు అమలులోకి వస్తాయని అధికారిక వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి.

కాగా,ఇమిగ్రేషన్ స్కిల్ చార్జీలు, హెల్త్ సర్ చార్జీల భారాన్ని ఆయా సంస్థలే భరించాలని నిబంధనల్లో పేర్కొనడంతో పరిశ్రమ వర్గాల్లో ఆందోళన నెలకొంది. త‌న దేశ ప‌రిస్థితుల కార‌ణంగా వీసాల విషయంలో బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ సహా యురోపియన్ యూనియన్ లో సభ్యులు కానీ దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వీసా ప్రక్రియ ఖర్చు పెరగడంతోపాటు, వీసా పొంద‌డం కఠినతరమవుతుంది. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలన్నీ  యురోపియన్ యూనియన్ దేశాల నుంచి వచ్చే ఉద్యోగార్థులకూ వర్తింపజేసే అవకాశం ఉంది. మొత్తంగా భార‌తీయ నిపుణుల‌కు ఎదుర‌వుతున్న షాకుల ప‌రంప‌ర‌లో ఇది మ‌రో ఎపిసోడ్ అని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News