త్రీ కాపిటల్స్ : ఫైనల్ స్టేజ్ లో...ఎపుడంటే...?

Update: 2022-08-07 00:30 GMT
అక్కడ ఉన్నది జగన్. ఆయన మదిలో ఒక ఆలోచన మెదలాలే కానీ ఆచరణలో పెట్టక ఉండరు. రెండేళ్ళ క్రితం ఒక శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు అంటూ ఏపీలో రాజకీయ వేడిని జగన్ రాజేశారు. ఆ మీదట అసెంబ్లీలో బిల్లు నెగ్గినా శాసనమండలిలో మాత్రం చుక్కెదురు అయింది. దాంతో అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా మమ అనిపించేసి బిల్లుని చట్టం చేశారు.

అయితే అది న్యాయ సమీక్షలో వీగిపోయింది. కొద్ది నెలల క్రితం హై కోర్టు మూడు రాజధానుల విషయంలో విస్పష్టమైన అభిప్రాయన్ని ప్రకటించింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని కూడా క్లారిటీగా చెబుతూ తీర్పు ఇచ్చింది. దాని మీద సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉన్నా కూడా ఎందుకో మిన్నకుండిపోయింది. ఇక రీసెంట్ గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు.

శాసనసభలకు రాజధాని విషయాన ఏ రకమైన అడ్డంకులు లేకుండా ప్రస్తుతం ఉన్న చట్టానికి ఆర్టికల్ 3 ఏని చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని ఆ బిల్లులో ఆయన కోరారు. ఈ నేపధ్యంలో ఏమిటి జరుగుతోంది అన్న ఆసక్తి అయితే అంతటా ఉంది. మరో వైపు కర్నూల్ లో హై కోర్టు పెట్టాలీ అంటే హై కోర్టు ప్రభుత్వం కలసి ఒక అభిప్రాయానికి రావాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇలా చిక్కులు చికాకులు చాలా ఉన్నా కూడా జగన్ సర్కార్ మూడు మాత్రం మూడ్ ని దాటిపోవడంలేదని అంటున్నారు.

మూడు రాజధానుల బిల్లుని సాధ్యమైనంత త్వరలో అసెంబ్లీలో మరోమారు ప్రవేశపెడతారు అని అంటున్నారు. ఈ మేరకు తెర వెనక భారీ కసరత్తు జరుగుతోందని అంటున్నారు. న్యాయ నిపుణులు పరిశీలనలో మూడు రాజధానుల బిల్లులు ఉన్నట్లుగా చెబుతున్నారు. అక్కడ నుంచి క్లారిటీ వచ్చాక ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు తలెత్తవని భావించుకున్నాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారు అని అంటున్నారు.

మరి ఏం జరుగుతుంది, ఏమిటి అన్నది పక్కన పెడితే ఎన్ని రాజధానులు ఉండాలన్నది రాష్ట్రాల ఇష్టమని కేంద్రం గతంలో ప్రకటించింది. దాని మీద విస్పష్టమైన వివరణ కోసమే విజయసాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు అని అంటున్నారు. ఇక కేంద్రం రాష్ట్రాలకు ఉన్న ఈ అధికారం విషయంలో జోక్యం చేసుకోదని తెలిపాక అదే విధంగా శాసన వ్యవస్థకే అన్ని అధికారాలూ అని తేల్చాక అపుడు మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలోకి వస్తుంది అంటున్నారు.

ఈ నెలాఖరుకు కానీ లేక సెప్టెంబర్ లో కానీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయని అంటున్నారు. ఈ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు కచ్చితంగా సభలోకి వస్తుంది అని చెబుతున్నారు. అలాగే అనేక కీలకమైన బిల్లులను తెస్తారని అంటున్నారు. జగన్ ఆలోచన ఏమిటి అంటే ఎన్నికల ముందు కర్నూల్ కి హై కోర్టుని, విశాఖకు పాలనారాజధానిని తీసుకుపోవడం ద్వారా ఎన్నికల్లో తాను అనుకున్న రాజకీయ లబ్దిని పొందాలనేనట. మరి అది సాధ్యపడుతుందా. అడ్డంకులు ఏమైనా కొత్తగా ఎదురవుతాయా అన్నది చూడాల్సి ఉంది.
Tags:    

Similar News