పాల్ పాలిటిక్స్‌.. కాసింత న‌వ్వుకోండెహె!!

Update: 2022-08-02 15:35 GMT
పాలిటిక్స్ అంటే.. ఏంటి?  సీరియ‌స్ కామెంట్లు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల మ‌ధ్య స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లు.. బూతు పురాణం.. ఇదే క‌దా.. ఇటీవ‌ల క‌నిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల‌ను తీసుకున్నా.. దీనికి భిన్నంగా ఏమీ.. ఎవ‌రూ.. చేయ‌డం లేదు. అటు తెలంగాణ‌లో అయినా.. ఇటు ఏపీలో అయినా.. ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు.. విమ‌ర్శ‌ల బాణాలు.. రాజ‌కీయ ఎత్తులు.. పై ఎత్తులే క‌నిపిస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయాలు అంటే.. విసుగెత్తిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఏ నాయ‌కుడిని చూసినా.. ఏ పార్టీని చూసినా.. సీరియ‌స్‌గా క‌నిపిస్తున్నాయి.

అయితే.. ఇంత సీరియ‌స్ పాలిటిక్స్‌ను.. కామెడీ చేసేశారు.. ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు.. ప్ర‌పంచ శాంతి దూత‌గా చెప్పుకొనే కే.ఏ పాల్‌. ఆయ‌న ఏం మాట్లాడినా.. చూసేవారికి.. వినేవారికి న‌వ్వు ఆగ‌దు. పాపం.. ఆయ‌న ఎంతో సీరియ‌స్ గా రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ, అదేంటో ఆయ‌న చేసే ప్ర‌తి కామెంట్‌లోనూ.. కామెడీ పండేస్తుంది. ఆయ‌న హావ భావాల్లోనూ.. బ్ర‌హ్మానందం తొణికిస‌లాడేస్తాడు. దీంతో పాల్ రాజ‌కీయం.. ప్ర‌జ‌ల‌కు కామెండీ పంచులు పంచుతోంద‌నే.. వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న పాల్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలను రెండింటినీ.. త‌న ప్ర‌జాశాంతి పార్టీలో విలీనం చేయాల‌ని.. అలా అయితేనే బాగుంటుంద‌ని.. వ్యాఖ్యానించారు. ఇక‌, తాజాగా మంగళవారం, పాల్‌ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాశాంతి పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రంలోని బకాయి రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

“పెరుగుతున్న అప్పుల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ శ్రీలంక లాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని నివారించి, అన్ని రుణాలు మాఫీ కావాలంటే, ప్రజలు ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలి. రుణాలన్నీ తిరిగి చెల్లిస్తాను'' అన్నారు. అయితే.. దీనిపై ఆయ‌న ఎంత బాగానిల‌బడ్డారో.. వెంట‌నే తెలిసిపోతుంది. మరుసటి క్షణం, పాల్ పూర్తిగా విరుద్ధమైన వ్యాఖ్య చేశారు. తెలంగాణలో రాబోయేది ప్రజాశాంతి పార్టీ యేనని, తెలంగాణ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రి కాబోతున్నానని చెప్పారు. అంతేకాదు.. తెలంగాణలో ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని చెప్పారు.

ఓకే.. స‌రే.. అనుకుందాం.. అయితే.. ఆయ‌న  తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎలా తీర్చగలరనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.. సందేహం కూడా! దీనికి ఆయ‌న స‌మాధానం చెప్ప‌రు.. మీరు అడ‌గ‌కూడ‌దు.. అంతే!! ఇక‌, మ‌రో చోట మ‌రో కామెంట్ చేశారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల శ్రేయస్సు కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు తనతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు.

``ఆంధ్ర ప్రదేశ్ కు తిరిగి వస్తున్నా, వేల కోట్లు వెచ్చించినా రాజధానిని నిర్మించలేకపోయిన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల అధినేత‌లు.. జగన్, చంద్రబాబు  ఇద్దరూ బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి లొంగిపోయారు`` అని అనేస్తారు. ఇక‌, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కూడా పాల్ వదల్లేదు. ప‌వ‌న్ అంటే చాలా గౌర‌వం అని అన్నారు.

“ప్రజాశాంతి పార్టీలో చేరమని నేను అతనికి కనీసం 100 సార్లు ఆఫర్ ఇచ్చాను. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన లేదు’’ అని వాపోయారు.

తేలిందేంటంటే..

ఇంత‌కీ.. పాల్ చేస్తున్న ఈ వ్యాఖ్య‌లు.. రాజ‌కీయం చూస్తున్న వారు.. చివ‌రాఖ‌రుకు నిర్ణ‌యించుకున్న‌ది ఏంటంటే.. సీరియ‌స్ రాజ‌కీయాల్లో పాల్ కామెడీని పండిస్తున్నార‌నే!  సో.. ఆయ‌న కామెంట్ల‌ను సీరియ‌స్ గా తీసుకోకుండా.. కాసింత న‌వ్వేస్తే.. పోలా! అనేస్తున్నారు హాస్య ప్రియులు. ఎంతైనా.. రాజ‌కీయాల్లో ఉండాల్సిన నాయ‌కుడ‌ని కొంద‌రు న‌వ్వేస్తున్నారు!!
Tags:    

Similar News