వైసీపీ కరణానికి పోస్ట్ పోతుందా...?

Update: 2022-12-25 03:30 GMT
వైసీపీలో ఇపుడు ఎవరి పదవులు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ మధ్యనే విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ పదవి నుంచి ఉన్నట్లుంది మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుని తప్పించారు. ఇపుడు మరో ప్రెసిడెంట్ మీద వేటు పడబోతోంది అని అంటున్నారు. ఆయనే అనకాపల్లి జిల్లాకు చెందిన వైసీపీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ. ఆయన చోడవరం ఎమ్మెల్యే కూడా. పైగా మంత్రి పదవి మీద ఆశలు పెంచుకుంటే ఆయనకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి క్యాబినేట్ హోదాను జగన్ ఇచ్చారు.

ఇక ఇలా మూడు పదవులతో కరణం ఉన్నారు. దాంతో సొంత పార్టీలోనే ఆయన ప్రత్యర్ధులకు గుర్రుగా ఉంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ధర్మశ్రీ గెలవడంతో పాటు అన్ని సీట్లూ జిల్లాలో గెలవడం వైసీపీకి ముఖ్యం. ధర్మశ్రీ చూస్తే గడప గడపకు తిరుగుతున్నారు. దాంతో ఆయన జిల్లా పార్టీకి ఎక్కువ సమయం వెచ్చించలేకపోతున్నారు అని పార్టీ భావిస్తోందిట.

అదే విధంగా చూస్తే చోడవరంలో ధర్మశ్రీకి ఇపుడు టైట్ పొజిషన్ ఉంది అని సర్వేల ద్వారా తేలుతోంది అని అంటున్నారు. అదేలా అంటే మొదటి నుంచి తెలుగుదేశం కాంగ్రెస్ ల మధ్య ఈ సీటు ఎపుడూ పోటా పోటీగా ఉంటూ వస్తోంది. ఇపుడు జనసేన కూడా ఫీల్డ్ లో ఉంది. ఆ పార్టీ తరఫున కూడా బలమైన నేతలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు గెలుపు ఆశలు ఉన్న సీట్లలో చోడవరాన్ని కూడా టిక్కు పెట్టుకున్నారు.

దాంతో కరణం ధర్మశ్రీని పూర్తి స్థాయిలో తన సొంత నియోజకవర్గం మీద దృష్టి పెట్టమని అధినాయకత్వం చెప్పిందట. అదే టైం లో పార్టీ పదవిని వేరే వారికి ఇవ్వాలని చూస్తోందట. ఎమ్మెల్యే కాని వారికి ప్రత్యేకించి బీసీలకు ఈ పదవి ఇవ్వడానికి చూస్తున్నారు అని అంటున్నారు. వారు అయితేనే ఎన్నికల వేళ పూర్తి టైం ఇవ్వగలరు అని భావిస్తున్నారుట.

అలా కనుక చూసుకుంటే బీసీ నేతలలో ఎలమంచిలికి చెందిన బొడ్డేడ ప్రసాద్ ఉన్నారు. ఆయన బీసీ కమ్యూనిటీ. గవర సామాజికవర్గానికి చెందిన వారు. అయితే ఆయన ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు. ఆయన కాకపోతే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె కె కోటపాడు జెడ్పీటీసీ అయిన ఈర్లె అనూరాధకు జిల్లా పార్టీ పదవిని ఇవ్వాలని చూస్తున్నారు. ఆమె బీసీ. పైగా వెలమ సామాజికవర్గం.  మహిళా నాయకురాలిగా దూసుకుపోతున్నారు.

అయితే ఆమె తన తండ్రి ప్లేస్ లో మాడుగుల నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ అధినాయకత్వం మాత్రం ఎమ్మెల్యే సీటు కాకుండా పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవి ఇవ్వాలని చూస్తోందిట. అలా ఆమెను ఎన్నికల వేళ బరిలోకి దించి పార్టీ కోసం పనిచేయించాలని చూస్తోందిట.

ఇక విశాఖ జిల్లాకు కాపు సామాజికవర్గానికి చెందిన పంచకర్ల రమేష్ బాబు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. దాంతో అనకాపల్లికి బీసీ నేత అయితే బెటర్ అని వైసీపీ సామాజిక సమీకరణలను కూడా బేరీజు వేసుకుని ఆలోచిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి కరణానికి పార్టీ పదవి ముప్పు తప్పదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News