మునుగోడు రిజల్ట్ : ఏపీ రాజకీయాన్ని తారు మారు చేస్తుందా...?

Update: 2022-10-24 15:44 GMT
వచ్చే నెల 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడు తెలంగాణాలో ఉంది. రెండు లక్షల పై చిలుకు ఓటర్లకు సంబంధించిన  ఉప ఎన్నిక ఇది. అంతే కాదు గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్ధి కేవలం ఏడాది పాటు కూడా గట్టిగా పదవిలో ఉండలేరు. అయినా సరే మునుగోడు ఉప ఎన్నిక మీద అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే ఫోకస్ పెట్టాయి. ఒక విధంగా చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నాయి. మునుగోడులో మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉన్నాయి.

కాంగ్రెస్ కి ఇది సిట్టింగ్ సీటు. తిరిగి దక్కించుకోవాలన్నది ఆ పార్టీ తాపత్రయం. పట్టుదల. మునుగోడులో కనుక కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణా రాజకీయాల్లో మార్పులు పెద్ద ఎత్తున ఉంటాయి. టీయారెస్ ని కొట్టే పార్టీ కాంగ్రెస్ మాత్రేమే అన్న సంకేతం వెళ్తుంది. ఆ ప్రభావం ఏపీ మీద కూడా ఉంటుంది. ఈ మధ్యేన కర్నూల్ జిల్లాలో రాహుల్ రెండు నియోజకవర్గాలలో తిరిగారు. మంచి స్పందనే లభించింది. మరి తెలంగాణాలో కనుక కాంగ్రెస్ పుంజుకుంది అంటే తప్పకుండా ఏపీలో ఆ ప్రభావం ఉండి తీరుతుంది.

వైసీపీకి వ్యతిరేకంగా కట్టే కూటమిలో కాంగ్రెస్ ని కూడా చేర్చుకునే అంశాన్ని విపక్షాలు కూడా చురుకుగా పరిశీలిస్తాయన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది వైసీపీకి ట్రబుల్ ఇచ్చే పరిణామం అవుతుంది. ఇక బీజేపీ మునుగోడులో గెలిస్తే కనుక  తెలంగాణాతో పాటు ఏపీలో కూడా దాని ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. ఇప్పటికే తాము టీడీపీతో జట్టు కట్టమని చెబుతున్న బీజేపీ మరింత బిర్రబిగుసుకుని కూర్చోవచ్చు. జనసేన కూడా తన ఆలోచనలు మార్చుకుని  బీజేపీతో తిరిగి కలిసి ముందుకు వెళ్ళే చాన్స్ ఉండవచ్చు. అది వైసీపీకి లాభంగా మారితే టీడీపీకి ఇరకాటంగా మారుతుంది.

ఇక బీజేపీ కనుక తెలంగాణాలో ఓడితే కచ్చితంగా ఏపీలో బీజేపీ ఇంకా బలహీనపడుతుంది. అపుడు పొత్తుల వైపే చూపు సారించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జనసేన టీడీపీ వైపుగా అడుగులు వేస్తున్న క్రమంలో బీజేపీ కూడా అనివార్యంగా ఆ దిశగా తన ఆలోచనలు మార్చుకోవచ్చు అని అంటున్నారు. అది కచ్చితంగా టీడీపీ జనసేనలకు మేలు చేసే వ్యవహరం అయితే వైసీపీకి రాజకీయంగా షాకింగ్ పరిణామంగా మారుతుంది.

ఇక ఈ రెండు పార్టీలు ఓడి టీయారెస్ కనుక మునుగోడులో గెలిస్తే కచ్చితంగా ఏపీ మీద ఆ ప్రభావం గట్టిగానే ఉంటుంది. బీయారెస్ ని ఏపీలో విస్తరించేందుకు మరింత దూకుడుగా కేసీయార్ కార్యాచరణని సిద్ధం చేస్తారు. అదే కనుక జరిగితే అపుడు ఓట్ల చీలిక మీద ఆశలు పెట్టుకున్న వైసీపీకి ఆ పరిణామం ఎంతో కొంత లాభించే అవకాశం ఉండగా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని చెబుతున్న టీడీపీ జనసేన కూటమికి అది ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే మునుగోడులో మూడు పార్టీలలో ఏ పార్టీ గెలిచినా కూడా ఆ ప్రభావం కచ్చితంగా ఏపీ రాజకీయాల మీద పడుతుంది అంటున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ, టీయారెస్ ఏపీలో గేమ్  చేంజర్లుగా ఉంటాయని విశ్లేషణలు ఉన్న నేపధ్యంలో మునుగోడు రిజల్ట్ ఏపీకి చాలా అవసరంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News