గిన్నిస్ రికార్డులోకి నిజామాబాద్…కవిత పరిస్థితేంటో!

Update: 2019-04-11 11:15 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయ - కల్వకుంట్ల కవిత బరిలో దిగుతున్న నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో దేశవ్యాప్తంగా అందరి చూపును తనవైపు తిప్పుకొంటోంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 185 మంది బరిలో నిలిచ్చారు. వీరిలో 182 మంది టీఆర్ ఎస్ పార్టీకి - ప్రభుత్వానికి వ్యతిరేకంగా బరిలో నిలిచిన రైతులే!  భారీగా రైతులు బరిలో నిలవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ నియోజకవర్గం దీంతో పాటుగా గిన్నిస్ రికార్డ్ వైపు సైతం కదులుతోందని అంటున్నారు.

ప్రధాన పార్టీలతో పాటు ఈసారి ఎర్రజొన్న - పసుపు రైతులు తమ సమస్యలను దేశ ప్రజలందరి దృష్టికి తేవాలనే ధృడ సంకల్పంతో 178 మంది మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేసి బరిలో నిలిచారు. రైతులంతా తమ ఓట్లు తామే వేసుకోవాలని తీర్మానించుకోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా - మెజార్టీ అంతంత మాత్రంగానే వస్తుందని భావిస్తున్నారు. కాగా, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యామ్లతో పాటు అందరి కదలికలను పరిశీలించేందుకు వీలుగా వీడియో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1788 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా - సమస్యాత్మకమైనవిగా గుర్తించిన చోట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2188 మంది ప్రిసైడింగ్ అధికారులు - 2139 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులతో పాటు 6966 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ విధుల్లో నియమించారు. ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలన జరిపేందుకు 698మంది మైక్రో అబ్జర్వర్లకు బాధ్యతలు పురమాయించారు. ఐదు పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టోరల్ అధికారిని ఏర్పాటు చేస్తూ - ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణమే అధిగమించేందుకు వీలుగా అతని వెంట ఇంజనీర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.

185 మంది అభ్యర్థులు బరిలో దిగుతున్న  నేపథ్యంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి పన్నెండు బ్యాలెట్ యూనిట్లను అమర్చనున్నారు. 1,788 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎల్ ఆకారంలో ఈవీఎంల అమరికను కూర్పు చేశారు. మొత్తం 12వేల సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణలో పనిచేయనున్నారు. బెల్ - ఈసీఐఎల్ నుంచి 400 మంది ఇంజినీర్లు ఈవీఎంలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికకు కావాల్సిన 26వేల బ్యాలెట్ యూనిట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 21,500 వీవీప్యాట్లను ఏర్పాటు చేశారు. ఉదయం గంట లేటుగా 8గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో సాయంత్రం గంట సమయాన్ని పెంచి ఆరు గంటల వరకు అవకాశం కల్పించారు. ఇక అభ్యర్థుల గుర్తుల విషయంలో అయోమయానికి గురికాకుండా ఓటర్ల అవగాహన కోసం పోలింగ్ కేంద్రాల బయట ప్లెక్సీలను ఏర్పాటుచేశారు. ఎవరికి ఏ గుర్తు ఉన్నదో స్పష్టంగా కనిపించేటట్లు పెడుతున్నారు.

కాగా, కేవలం భారీ స్థాయిలో అభ్యర్థులతోనే కాకుండా, రికార్డు స్థాయిలో ఈవీఎంలు వాడకంలోనూ నిజామాబాద్ రికార్డ్ సృష్టిస్తోంది. నిజామాబాద్ లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు - పోలింగ్ ఏర్పాట్లతో ఈ ఎన్నిక గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం ఖాయమని పలువురు విశ్లేషిస్తున్నారు. కాగా, నామినేషన్లు వేసిన పసుపు, ఎర్రజొన్న రైతులున్న గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో పోలింగ్ ఏజెంట్లను నియమించారు. కమ్మర్ పల్లి - జక్రాన్ పల్లి - ఆర్మూర్ - బాల్కొండ మండలాల్లోని పలు పోలింగ్ స్టేషన్లలో వేసిన షామియానాలు ఏజెంట్లతో నిండిపోయాయి.

కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 14,95,957 మంది ఉండగా.. ఈసారి 15,53,386 మంది ఓటర్లు ఉన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదనంగా 57,429 మంది ఓటర్లు పెరిగారు. పోలింగ్ శాతం పరిశీలిస్తే గతంలో 68.87 శాతం పోలింగ్ కాగా.. అత్యధికంగా బోధన్లో 75.40 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా నిజామాబాద్ అర్బన్ లో 51.46 పోలింగ్ శాతం నమోదైంది.
Tags:    

Similar News