పీకే ఛాప‌ర్ పర్మిష‌న్స్‌!... ఇంత క‌థ ఉందా?

Update: 2019-03-29 17:43 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు కొత్త త‌ర‌హా ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ట‌. ఇదేదో వేరెవ‌రో చెప్పిన మాట కాదు. స్వ‌యంగా ప‌వ‌న్ క‌ల్యాణే చెప్పిన మాట‌. రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్లే స‌మ‌యంలో త‌న‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని - క‌నీసం త‌న హెలికాప్ట‌ర్ ల్యాండింగ్ కు కూడా అనుమ‌తులు ఇవ్వ‌ట్లేద‌ని ప‌వ‌న్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన వైనం మ‌నం చూసిందే క‌దా. అయినా ప‌వ‌న్ హెలికాప్ట‌ర్ ఫ్లైయింగ్ కు గానీ - ల్యాండింగ్‌ కు గానీ... అనుమ‌తులు ఇవ్వాల్సింది కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోని డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆప్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ)నే క‌దా. దేశంలోని విమాన‌యానానికి సంబంధించి వ్వ‌వ‌హారాల‌న్నింటినీ ప‌ర్య‌వేక్షించే ఈ సంస్థ కొంద‌రి ప‌ట్ల అనుకూలంగా మ‌రికొంద‌రి ప‌ట్ల వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించే అవ‌కాశాలు త‌క్కువే క‌దా. అయితే కేంద్ర ప్ర‌భుత్వంలోని పౌర విమాన‌యాన శాఖ ఆధ్వ‌ర్యం కింద ప‌నిచేస్తున్న ఈ సంస్థ‌పై కేంద్రంలోని ప్ర‌భుత్వంపై ఎంతో కొంత ప్ర‌భావం ఉంటుంది క‌దా.

ఇప్పుడు ఈ కోణాన్నే ప‌ట్టేసుకున్న ప‌వ‌న్ - ఆయ‌న పార్టీ నేత‌లు... కేంద్రం క‌క్ష‌పూరిత వైఖ‌రి కార‌ణంగానే త‌మ హెలికాప్ట‌ర్ ల్యాండింగ్‌ కు అనుమ‌తులు ద‌క్క‌డం లేద‌ని ఓ కొత్త వాద‌న‌ను వినిపిస్తున్నారు. అంతేకాదండోయ్‌... డీజీసీఏ వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ క‌క్ష‌పూరిత వైఖ‌రికి కార‌ణం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భావ‌మే ఉంద‌ట‌. రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్‌ కు మంచి ప‌ట్టుంది క‌దా. ఆ ప‌ట్టు బాగా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప‌వ‌న్ పర్య‌టిస్తే... వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించి ఎక్క‌డ కామెంట్ చేస్తారో - ఆ ప్ర‌భావం జ‌గ‌న్ కు ఎక్క‌డ దెబ్బేస్తుందోన‌న్న భ‌యంతోనే జ‌గ‌న్ పార్టీ నేత‌లు కేంద్రం వ‌ద్ద కూర్చుని ప‌వ‌న్ హెలికాప్ట‌ర్‌ కు రాయ‌ల‌సీమ‌లో ల్యాండింగ్‌ కు అనుమ‌తులు మంజూరు చేయ‌ట్లేద‌న్న‌ది ఈ వాద‌న‌లోని ప‌ర‌మార్ధంగా తెలుస్తోంది.

అయినా హెలికాప్ట‌ర్ ల్యాండింగ్ కు అనుమ‌తులు ఇవ్వ‌క‌పోతే... ప‌వ‌న్ రాయ‌ల‌సీమ‌లో అడుగుపెట్ట‌డం లేదా? ప‌వ‌న్ కంటే కూడా జ‌గ‌న్ మీద మ‌రింత‌గా ఎగిరిప‌డుతున్న చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌డం లేదా? అన్న స‌రికొత్త అనుమానాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. మొత్తంగా త‌న‌కు అనుమ‌తుతుల విష‌యంలో ఎక్క‌డిక‌క్క‌డ ఇబ్బంది క‌లిగిస్తున్న విష‌యంపై ప‌వ‌న్ ఈ త‌ర‌హా కార‌ణాలు వ‌ల్లె వేస్తుంటే... జ‌నం మాత్రం మ‌రో కోణంలో ఆలోచిస్తే అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేదన్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
Tags:    

Similar News