కనకదుర్గను ఇంట్లోకి రానివ్వడం లేదు..!

Update: 2019-01-23 10:39 GMT
శబరిమలై అయ్యప్పస్వామి ఆలయంలోకి ఈనెల 2న ఇద్దరు మహిళలు ప్రవేశించారన్న వార్త సంచలనమైంది. అయ్యప్పస్వాములు వేసుకునే డ్రెస్సులో బిందు, కనకదుర్గ అనే మహిళలు ఆలయంలోకి వెళ్లి సంచలనం సృష్టించారు. ఇప్పటి వరకు ఈ ఆలయంలోకి 10 సంవత్సరాలలోపు, 50 సంవత్సరాల వయసు పైబడిన వారు మాత్రమే ప్రవేశించారు. గతంలో ఓసారి బిందు, కనకదుర్గలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా పంబా అనే గ్రామం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎలాగైనా ఆలయంలోకి ప్రవేశిస్తామని చెప్పి వారు ఈనెల 2న అయ్యప్ప గుడిలో అడుగుపెట్టారు.

ఇదిలా ఉండగా ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు ఇంట్లో మాత్రం కష్టాలనెదుర్కొంటున్నారు. వీరిలో కనదుర్గ అనే మహిళను అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వడం లేదు. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేశారని ఇదివరకే ఆమె అత్తతో పాటు భర్త కనకదుర్గను చితకబాదారు. తాజాగా ఆమె భర్త ఇల్లుకు తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లాడు.  దీంతో ఆమె ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మై హోంలో తలదాచుకుంటోంది.

ఇక ఆలయంలోకి ప్రవేశించిన మరో మహిళ బిందు కూడా అవమానాలను ఎదుర్కొంటోంది. బహిరంగంగానే ఆమెకు వేధింపులు మొదలవ్వగా ఆమె కూతురు కూడా తీవ్ర మనస్థాపానికి గురవుతోంది. ఆమె చదువుకుంటున్న పాఠశాలలో ఇతరుల పిల్లల్ని ఆమెకు దూరంగా ఉండాలని వారి తల్లిదండ్రులు చెబుతున్నారట. అంతేకాకుండా ఆమె బయటకు వచ్చినప్పుడు 'మీ అమ్మలాగా మారకు' అంటూ కామెంట్లు చేస్తున్నారట.

తన తప్పు తెలుసుకొని భక్తులకు క్షమాపణ చెబితేనే ఇంట్లోకి రానిస్తామంటూ కనకదుర్గ బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె కుటుంబ సభ్యులపై ఇతరుల ఒత్తిడితోనే ఇలా చేస్తున్నారంటూ కనకదుర్గ స్నేహితురాలు బిందు పేర్కొంటోంది. కాగా ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
    
Full View
Tags:    

Similar News