న్యూఇయర్ లో ఏటీఎం కష్టాలకు చెల్లుచీటి?

Update: 2016-12-21 08:58 GMT
నవంబరు 8న మొదలైన ఏటీఎం కష్టాలు.. అంతుపొంతు లేకుండా సా..గుతూనే ఉన్న విషయం తెలిసిందే. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో.. ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకోవటం బ్రహ్మ ప్రళయంగా మారింది. బారులు తీరే క్యూలైన్లతో పాటు.. ఏటీఎంలలో తగినంత నగదును ఉంచకపోవటం ఒక ఎత్తు అయితే.. గతంలో మాదిరి కాకుండా ఏటీఎం విత్ డ్రా విషయంలో కేంద్రం విధించిన పరిమితులతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి.

బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ.. వాటిని చేతికి తీసుకునేందుకు తలప్రాణం తోకకు వచ్చే పరిస్థితి. ఏటీఎంలలో తడవకు రూ.2500 మాత్రమే తీసుకునే వీలు ఉండటం.. ఆ కొద్దిపాటి మొత్తాన్ని చేతికి తీసుకోవటానికి గంటల కొద్దీ ఏటీఎంల వద్ద నిలబడాల్సి రావటంతో సామాన్యులు కిందామీదా పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఏటీఎం కష్టాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసిందని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నవంబరు 8 నుంచి అమలు చేస్తున్న పరిమితుల్ని ఈ నెల 30 తర్వాత నుంచి ఎత్తి వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబరు 30 నుంచి ఏటీఎం లావాదేవీలపై విధించిన పరిమితిని ఎత్తివేయటంతో పాటు.. ఎంత కావాలంటే అంత మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు అనువుగా పరిస్థితుల్ని మార్చాలన్న ఆలోచనలో కేంద్రం ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుందని తెలుస్తోంది. అదే జరిగితే.. న్యూ ఇయర్ కు దేశ ప్రజలకు మోడీ సర్కారు తీపికబురు చెప్పినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News