తండ్రిని ఆదరించిన నేల.. తనయుడిని పొమ్మంటోందా?

Update: 2019-04-03 12:22 GMT
నాడు తండ్రికి ఆ నియోజకవర్గం పెట్టని కోట.. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చిన కొడుకును కూడా ఆ నియోజకవర్గం ఆదరించింది. అక్కున చేర్చుకుంది. ఎమ్మెల్యేగా గెలిపించింది. కానీ నాడు అన్న ఎన్టీఆర్ పేదల పక్షపాతిగా అక్కడ అభివృద్ధికి పాటుపడితే.. నేడు ఆయన కొడుకు బాలయ్య దాడులు - ప్రతిదాడులు - సమస్యలను గాలికొదిలేసి హిందూపురం నియోజకవర్గానికి గుదిబండగా మారారు. ఎన్టీఆర్ ను ఆదరించిన అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నేడు.. బాలయ్యను నిరాదరిస్తోంది. ఆయన్ను ఈసారి ఎన్నికల్లో ఓడించేందుకు కంకణం కట్టుకుందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

మహా నాయకుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన్ని ఆదరించి శాసనసభకి పంపించింది హిందూపురం నియోజకవర్గం. కానీ అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ప్రజల్లో కనిపిస్తోంది. హిందూపురం నియోజకవర్గం ప్రజలు ఎన్టీఆర్ ను గుండెల్లో పెట్టుకున్నారు. మరి ఆయన కుమారుడు బాలకృష్ణకి అదే హిందూపురం వాసులు 2014లో పోటీచేసినప్పుడు కూడా అంతే స్థాయిలో ఆదరించి గెలిపించారు. అయితే నాన్న ఎన్టీఆర్ లా ప్రజలను సాకడంలో బాలయ్య విఫలమయ్యాడని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు.

మూడుసార్లు హిందూపురం నుంచి పోటీ చేసారు ఎన్టీఆర్. నామినేషన్ వేసి - రాష్ట్రమంతా పర్యటించేవారు. ప్రచారం కోసం ఆయన ఏనాడూ నియోజకవర్గంలో తిరిగింది లేదు. అయినా భారీ మెజారిటీతో గెలిచేవారు. అది ఆయన హీరోయిజం.

ఆ మహానుభావుడి తనయుడు బాలయ్య ప్రస్తుతం అదే హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇల్లిల్లు - వీధి వీధి - వాడవాడలు తిరుగుతున్నాడు. బాలయ్య వాహనశ్రేణి - అరకొర జనాలు తప్ప ప్రజల్లో ఎటువంటి స్పందనా కానరావడం లేదు. ఇందుకు ఈ ఐదేళ్లలో బాలయ్య చేసిన పనులే కారణమవుతున్నాయి. బాలయ్య పీఏ ప్రజలను పీడించడాలు.. నియోజకవర్గంలో అభివృద్ధిని పట్టించుకోకపోవడం.. తాగునీటి సమస్య సహా తిష్టవేసిన సమస్యలు తీర్చడం బాలయ్య వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే ఈ ఎన్నికల వేల ఒకప్పటి తెలుగుదేశం చరిష్మా ప్రస్తుతం హిందూపురం సన్నగిల్లిపోయిందని ప్రతీ ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు.


Tags:    

Similar News