శెభాష్ ఎన్టీఆర్‌..ఫ్యాన్స్ మ‌న‌సు గెల్చుకున్నావ్‌!

Update: 2018-12-03 06:59 GMT
జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారానికి వ‌స్తారా? రారా? తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కూక‌ట్‌ప‌ల్లి నుంచి ఆయ‌న సోద‌రి నంద‌మూరి సుహాసిని బ‌రిలో దిగిన‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్‌ ఫాన్స్ - టీడీపీ నేత‌లు - కార్య‌క‌ర్త‌ల‌తోపాటు సామాన్య జ‌నానికీ ఆస‌క్తి రేకెత్తించిన ప్ర‌శ్న ఇది. జూనియ‌ర్ ప్ర‌చారానికి వ‌స్తార‌ని కొంత‌మంది.. రార‌ని మరికొంత‌మంది చాన్నాళ్లు విశ్లేష‌ణ‌లు వినిపించారు. ఊహాగానాలు వ్యాపింప‌జేశారు. వాట‌న్నింటికీ ఇటీవ‌లే ఎన్టీఆర్ చెక్ పెట్టేశారు. తాను ప్ర‌చారానికి రావ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌చారానికి రాకూడ‌ద‌న్న ఎన్టీఆర్ నిర్ణ‌యం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. సొంత అక్క పోటీలో ఉన్నా కూడా ఎన్టీఆర్ ప్ర‌చారానికి నో చెప్ప‌డం టీడీపీతో ఆయ‌న సంబంధాలు మెరుగ్గా లేవ‌ని చెప్పేందుకు నిద‌ర్శ‌న‌మ‌ని కొంద‌రు వాదిస్తున్నారు. ఎన్టీఆర్ నిర్ణయానికి దారితీసిన అనేక ప‌రిస్థితుల‌ను వారు విశ్లేషిస్తున్నారు.

వాస్త‌వానికి నంద‌మూరి హ‌రికృష్ణ బ‌తికి ఉన్న‌ప్ప‌టి నుంచే ఆయ‌న కుటుంబానికి టీడీపీకి మ‌ధ్య దూరం పెర‌గ‌డం ప్రారంభ‌మైంది. ముఖ్యంగా హ‌రికృష్ణ‌కు చంద్ర‌బాబు అంటే పెద్ద‌గా ప‌డేది కాద‌ని ప‌లువురు చెబుతుంటారు. హ‌రన్న‌కు పార్టీలో బాబు ప్రాధాన్య‌మివ్వ‌లేద‌న్న‌ది వారి వాద‌న‌. హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత చంద్ర‌బాబు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ - క‌ల్యాణ్ రామ్‌ ల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేశారు. అయితే - ఆ ప్ర‌య‌త్నంలోనూ చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ బుద్ధిని పోగొట్టుకోలేద‌ని కొంద‌రు చెబుతున్నారు. హ‌రికృష్ణ కుమార్తె సుహాసినిని ఎన్నిక‌ల బ‌రిలోకి దించ‌డం అందులో భాగ‌మేన‌ట‌. హ‌ర‌న్న మ‌ర‌ణంతో ప్ర‌జ‌ల్లో ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకునేందుకే చంద్ర‌బాబు ఈ వ్యూహం ప‌న్నార‌ట‌. ఎలాగూ సుహాసిని పోటీలో ఉంటే ఎన్టీఆర్ కూడా టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌క త‌ప్ప‌ద‌ని ప్ర‌ణాళిక ర‌చించార‌ట‌.

అయితే - చంద్ర‌బాబు వ్యూహాన్ని ఎన్టీఆర్ గుర్తించార‌ట‌. తండ్రి మ‌ర‌ణించిన‌ప్పుడు త‌మ‌కు అండ‌గా నిలిచిన కేసీఆర్ కుటుంబానికి - టీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌డం స‌బ‌బు కాద‌నీ ఆయ‌న అనుకున్నార‌ట‌. దీనికి తోడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆయ‌న ఇప్పుడే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరుకోవ‌డం లేదు. టీడీపీ త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారానికీ వారు వ్య‌తిరేకంగానే ఉన్నారట‌. ఎన్టీఆర్ సినిమాల‌ను దూరం పెట్టేలా గ‌తంలో టీడీపీ వ‌ర్గాలు లోలోప‌ల చేసిన ప్ర‌చార‌మే ఇందుకు కార‌ణ‌మ‌ట‌.

ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి అభిమానుల ఆకాంక్ష‌ల‌కే పెద్ద పీట వేశారు. త‌న మ‌న‌స్సాక్షి చెప్పిన దానికే ఓటేశారు. అందుకే ప్ర‌చారానికి దూరంగా ఉన్నారు. రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న సినిమాతో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఎన్టీఆర్ ప్ర‌చారానికి రాలేక‌పోతున్నార‌న్న‌ది కేవ‌లం పైకి చెప్పే కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. త‌న తండ్రి చావును కూడా రాజ‌కీయ ల‌బ్ధి కోసం వాడుకోవాల‌ని చూస్తున్న చంద్ర‌బాబు వైఖ‌రి న‌చ్చ‌కే ఆయ‌న ప్ర‌చారానికి నో చెప్పార‌ని వారు విశ్లేషిస్తున్నారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఎన్టీఆర్ టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారానికి దూరంగా ఉండాల‌ని ఆయ‌న ఫ్యాన్స్ కోరుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News