అమెరికన్లు ఒబామాను లైట్ తీసుకున్నారా?

Update: 2016-11-09 15:48 GMT
గడిచిన 24 గంటల్లో ఊహించని ఘటనలు వరుసుగా జరిగిపోయాయని చెప్పొచ్చు. ఒకటి తర్వాత మరొకటి అన్న చందంగా చోటు చేసుకున్న పరిణామాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోయే పరిస్థితి. పెద్దనోట్లను రద్దు చేస్తూ దేశ ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారన్న వార్త చాలామందిని అయోమయానికి గురి చేసింది.

కాన్ఫిడెన్స్ గా హిల్లరీనే అంతిమ విజేత అన్నట్లుగా అందరూ ఫీలైన వేళ.. అలాంటి అంచనాల్ని పూర్తిగా తప్పని తేలుస్తూ అమెరికన్లు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రపంచానికే షాకింగ్ గా మారింది. తాజాగా వెల్లడైన ఫలితాల్ని చూసినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా దేశాధినేత బరాక్ ఒబామా మాటను అమెరికన్లు లైట్ తీసుకున్నట్లుగా కనిపించక మానదు.

అత్యంత సక్సెస్ ఫుల్ అమెరికా అధ్యక్షుల్లో ఒకరిగా కీర్తించే ఒబామా నిష్ర్కమణ అత్యంత నిరాశ.. నిస్పృహల మధ్య సాగనుందనటంలో సందేహం లేదు. నల్ల సూరీడంటూ పెద్దన్న పదవిని చేపట్టిన ఒబామాను రెండుసార్లు అమెరికన్లు నెత్తిన పెట్టుకున్నారు. ఆయన చేసిన ప్రసంగాలకు తన్మయత్వంతో ఊగిపోయారు. ఒబామా తప్ప మరెవరూ అమెరికాకు అధ్యక్షుడు కాలేరంటూ డిసైనట్లుగా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు అలాంటి ఒబామా పరిస్థితి చూస్తే జాలి వేయక మానదు. అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు ఒక రోజు ముందు ఒబామా తన ఆఖరి అస్త్రాన్ని సంధించారు. తమ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన్ కు ఓటు వేయాలని.. అది  కూడా తన మాట మేరకు అన్న మాటను కూడా వాడేశారు.

అంతకు ముందు జరిగిన పలు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఒబామా పాల్గొన్నప్పటికీ తన చివరి ప్రసంగాల్లో మాత్రం ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం లోపించటమే కాదు.. బతిమిలాడుకున్న ధోరణిలో ఉన్నాయని చెప్పాలి. అంతేకాదు.. ఆయన మాటల్లో కాసింత నిరాశ సౌండ్ వినిపించిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏది ఏమైనా.. అమెరికన్తు విపరీతంగా ఆరాధిస్తారని చెప్పే అధినేత మాటల్ని అమెరికన్ల లైట్ తీసుకోవటం కనిపిస్తుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News