గౌరవంగా తొడిగిన నల్లకోట్లు తిరిగిస్తే మెస్సీకి రూ.8.2 కోట్ల ఆఫర్

Update: 2022-12-26 04:08 GMT
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా చూసిన ఫిఫా వరల్డ్ కప్ ముగిసింది. ఖతార్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అద్భుతమైన వ్యక్తిగత ప్రతిభతో మెస్సీ తన జట్టుకు దేవుడయ్యాడు. అన్నీ తానై జట్టును నడిపించిన అతను ఎట్టకేలకు పదిహేడేళ్లుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ ను అర్జెంటీనాకు అందేలా చేయటమే కాదు.. ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఘనతను సాధించి బెస్ట్ ఫుట్ బాలర్ గా గోల్డెన్ బాల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అతగాడి ఆటతీరుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులకు పండుగ చేసుకున్నారు.

అతడు చూపించిన ప్రతిభకు ఫిఫా టైటిల్ ను అందించే క్రమంలో గౌరవ సూచకంగా నలుపు.. బంగారు వర్ణంలో ఉన్న కోటును తొడిగారు. ఈ నల్లకోటును అరబ్ దేశాల్లో బిప్త్ అని పిలుస్తారు. ఎవరైనా గొప్ప పని చేసినప్పుడు వారిని సత్కరించే క్రమంలో అతగాడికి గౌరవసూచకంగా సదరు నల్లకోటును తొడుగుతారు. టోర్నీని అందించటానికి ముందు మెస్సీకి ఈ నల్లకోటును తొడిగిన విషయం తెలిసిందే.

మెస్సీకి తొడిగిన నల్లకోటును ఖతర్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ స్వయంగా తన చేతులతో అందించగా.. దాన్ని ధరించిన తర్వాతే ఫిఫా వరల్డ్ కప్ ను అందుకున్నాడు మెస్సీ. అత్యంత గౌరవపూర్వకంగా భావించే సదరు నల్లకోటు ఖరీదు అక్షరాల 10 లక్షల డాలర్లు.

మన రూపాయిల్లో చెప్పాలంటే 8.2 కోట్ల రూపాయిలు. మెస్సీకి ఈ కోటు అందించింది ఖతార్ రాజు షేక్ తుమిమ్ బిన్ హమద్ అల్ థానీ అయినప్పటికీ.. దాన్ని బహుకరించింది మాత్రం ఒమన్ కు చెందిన ఎంపీ (పార్లమెంటు సభ్యుడు) అహ్మద్ అల్ బిర్వానీ. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది.

దాని సారాంశం ఏమంటే.. ఖతర్ సుల్తాన్ తరఫున ఫిఫా వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న అర్జెంటీనా జట్టుకు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆ సందర్భంగా అందజేసిన నలుపు.. బంగారు వర్ణంలో ఉన్న అరబిక్ బిప్త్ శౌర్యానికి.. తెలివితేటలకు నిదర్శనమన్నారు. దాన్ని అందుకున్న మెస్సీ.. మళ్లీ దాన్ని తిరిగి ఇచ్చేస్తే అందుకు ప్రతిగా.. రూ.8.2 కోట్లు ఇద్దామనుకున్నట్లు తెలిపారు.

మెస్సీ సాధించిన విజయానికి గుర్తుగా దాన్ని తొడిగామని.. అయితే.. అది తమ దేశంలోనే ఉంటే దానికి గౌరవం ఉంటుందన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి మరి.. రూ.8.2 కోట్లకు తాను అందుకున్న బిప్త్ ను తిరిగి ఇచ్చేస్తారా? లేదా? అన్న దానిపై మెస్సీ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News