ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఫిబ్రవరిలో థర్డ్ వేవ్

Update: 2021-12-19 06:34 GMT
కరోనా మహమ్మారి పీడ వదిలిందని అనుకుంటున్న సమయంలో ‘ఒమిక్రాన్’ రాక ప్రపంచాన్ని మళ్లీ లాక్ డౌన్ దిశగా నడిపిస్తోంది. కొత్తరూపం మార్చుకున్న కోవిడ్ రాకాసి ఇప్పుడు అన్ని దేశాలపై విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. మన దేశంలోకి ఎంట్రీ ఆలస్యంగా వచ్చినా.. లేటెస్ట్ గా కేసులు విజృంభిస్తున్నాయి.

కోవిడ్ 19 డెల్టా వేరియంట్ కంటే 70 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ సృష్టించిన కల్లోలం నుంచి తేరుకోకముందే కొత్త వేరియంట్ చుక్కలు చూపిస్తోంది. రెండో వేవ్ లో కరోనా డెల్టా వేవ్ దేశంలో లక్షలమంది ప్రాణాలు తీసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం డెల్టా కంటే అత్యంత ప్రమాదకరమైనది తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.శరీరంలోకి గాలి ద్వారా ప్రవేశించే ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా కంటే 70 రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

దేశంలో ఫిబ్రవరి నాటికి థర్డ్ వేవ్ రావడం ఖాయమని కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ అంచనావేసింది. ప్రస్తుతం రోజువారీ కేసుల లోడు దాదాపు 7500గా ఉందని.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని కమిటీ పేర్కొంది.

ఇండియాలో ఒమిక్రాన్ థర్డ్ వేవ్ ఖాయమని పేర్కొన్న కమిటీ హెడ్ విద్యాసాగర్.. అయితే సెకండ్ వేవ్ అంత ఉధృతంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మొదట్లో థర్డ్ వేవ్ దేశాన్ని తాకే అవకాశం ఉందని విద్యాసాగర్ పేర్కొన్నారు.

దేశంలో వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున జరగడంతో ఇమ్యూనిటీ పెరిగిందని.. ఫలితంగా సెకండ్ వేవ్ అంత ఉధృతంగా థర్డ్ వేవ్ ఉండే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. అయితే థర్డ్ వేవ్ మాత్రం పక్కా అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశంలో 7500 కేసులు నమోదవుతున్నాయని.. ఒమైక్రాన్ కారణంగా ఈ లెక్కలు మారిపోయే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఫిబ్రవరిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం దేశంలో ఉందని పేర్కొన్నారు.అయితే సెకండ్ వేవ్ లో నమోదైనట్టుగా థర్డ్ వేవ్ లో అంత భారీగా రోజువారీ కేసులు నమోదయ్యే అవకాశం మాత్రం లేదని తేల్చిచెప్పారు.
Tags:    

Similar News