గుడ్డు టెండ‌ర్‌.. ర‌క్త చ‌రిత్ర‌ను మిగిల్చిందిగా..!

Update: 2019-10-17 07:19 GMT
వ్యాపారంలో పోటీ ఉండాలి. అయితే - ఆ పోటీ ఆరోగ్య‌క‌రంగా ఉండాలి. కానీ, రాజ‌కీయాల‌ను మించిపోయిన వ్యాపారాలు - రాజ‌కీయాల‌తో ముడిప‌డిన వ్యాపారాల ఫ‌లితంగా తాజాగా క‌ర్నూలు జిల్లాలో కోడిగుడ్ల టెండ‌ర్ల వ్య‌వ‌హారం ర‌క్త చ‌రిత్రను త‌ల‌పించింది. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో అమ‌ల‌వుతున్న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కంలో భాగంగా.. కోడిగుడ్ల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్ర‌భుత్వం టెండ‌ర్ల‌ను పిలిచింది. ఈ టెండ‌ర్ల వ్య‌వ‌హార‌మే రాజ‌కీయ రంగు పులుముకుని - ర‌క్తం కారేలా త‌న్ను వ‌ర‌కు వ‌చ్చింది. విష‌యంలోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని 2,930 ప్రభుత్వ - ఎయిడెడ్‌ పాఠశాలలకు మధ్యాహ్న భోజనంలో ఇచ్చే గుడ్డు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ ను ఎంపిక చేయడం కోసం అధికారులు టెండ‌ర్లు పిలిచారు.

వాస్తవానికి ఈ ఏడాది జూలై 25న అధికారులు తొలిసారి టెండర్లు ఆహ్వానించారు. అప్పట్లో 9 మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. సర్టిఫికెట్లను అధికారులకు ఇచ్చే సమయంలో గొడవ జరగడంతో - ఆ టెండరు రద్దు అయింది. దీంతో ఈ నెల ఆరు నుంచి పది రోజులపాటు టెండర్లు వేయడానికి అవకాశం ఇచ్చారు. 4 ఏజెన్సీలు ముందుకొచ్చాయి. చివరిరోజు బుధవారం ధ్రువపత్రాలను సమర్పించే ప్రక్రియను చేపట్టారు. ఇంతలో విశాఖపట్నానికి చెందిన యునైటెడ్‌ ట్రేడర్స్‌ టెండరుదారులకు - శివతేజ పౌల్ర్డీ ఫామ్స్‌ కు చెందిన దినేశ్‌ గౌడ్‌ - రఘువీర్‌ గౌడ్‌ ల మధ్య ఘర్షణ జరిగింది.
 
ధ్రువీకరణ పత్రాలను బాక్స్‌ లో వేయడానికి వచ్చిన ‘యునైటెడ్‌ ట్రేడర్స్‌’ ప్రతినిధులను అవతలి వర్గీయులు అడ్డుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకొన్న రాళ్లు - ఇనుప రాడ్లతో ఇరుపక్షాలూ దాడులు చేసుకొన్నాయి. విశాఖ కాంట్రాక్టు సంస్థకు ఓ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ చార్జితోపాటు తొలిసారి గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే అండదండలు - అవతలి వర్గీయులకు ఓ మంత్రి మద్దతు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ దాడుల్లో శివతేజ పౌల్ర్డీ ఫామ్స్‌ ప్రతినిధి రఘు వీర్‌గౌడ్‌ తలకు తీవ్ర గాయమయింది. మరో నలుగురు కూడా గాయపడ్డారు. టెండరు బాక్సు వద్దకు వెళ్లడానికి ఒక వర్గం ప్రయత్నించగా.. ఉద్యోగులు అడ్డుకొన్నారు.

నిజానికి స‌ద‌రు మంత్రికి వ్యతిరేకంగా ఉండే కొందరు వైసీపీ నాయకుల మద్దతుతో అవతలి వర్గీయులు బుధవారం జరిగిన రీ టెండరు ప్రక్రియలో పాల్గొన్నారు. అయితే, ఈ రెండు వ‌ర్గాలూ కూడా ఒకే పార్టీ అదికూడా వైసీపీకి చెందిన నాయ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మొత్తం ఎపిసోడ్‌ లో కొంద‌రు మంత్రి వ‌ర్గంగా - మ‌రికొంద‌రు ఎమ్మెల్యే వ‌ర్గంగా ఉండడం ఆస‌క్తిగా మారింది. ఈ ప‌రిణామం రాజ‌కీయంగానే కాకుండా అధికార పార్టీలోనే తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఇలాంటి ప‌రిణామాల‌ను జ‌గ‌న్ చూస్తూ ఊరుకుంటారా? క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారా? అనేది చూడాలి.
Tags:    

Similar News