సీఎం కుర్చీ ఎవ‌రిదో ఇవాళ తేలిపోనుందా?

Update: 2017-04-20 04:32 GMT
త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. వెనుక నుంచి ఏదో అదృశ్య శ‌క్తి న‌డిపించిన‌ట్లుగా.. చ‌క‌చ‌కా రాజ‌కీయ ప‌రిణామాలు అంత‌కంత‌కూ మారిపోతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కూ అధికార పార్టీని న‌డిపించిన దిన‌క‌ర‌న్ ఒక్క‌సారిగా పార్టీ నుంచి వైదొలుగుతున్న‌ట్లుగా స్వ‌యంగా ప్ర‌క‌టించ‌టం ఏమిటి? కీల‌క ప‌రిణామాల నేప‌థ్యంలో చ‌క్రం తిప్పే అవ‌కాశాన్ని వ‌దిలేసి.. చిన్న‌మ్మ కామ్ అయిపోతున్న వైనాన్ని చూస్తే.. ఒకింత ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు.

గ‌డిచిన రెండు రోజుల్లో చోటు చేసుకున్న మార్పుల‌తో తమిళ‌నాడు రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోవ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు సీఎం పీఠం మీద ఎవ‌రు కూర్చోవాల‌న్న విష‌యం మీద అన్నాడీఎంకే రెండు వ‌ర్గాలు ఒక చోట‌కు చేరి చ‌ర్చ‌లు జ‌రిపే వ‌ర‌కూ వెళ్ల‌టం గ‌మ‌నార్హం. మాజీ ముఖ్య‌మంత్రి అమ్మ‌కు అత్యంత విదేయుడైన ప‌న్నీర్ సెల్వంకు మంత్రి ప‌ద‌విని ఇవ్వాల‌న్న‌ది ప‌ళ‌నిస్వామి వ‌ర్గం ఆలోచ‌న అయితే.. అందుకు భిన్నంగా.. త‌న‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వితో పాటు.. అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని ఇవ్వాలంటూ ప‌న్నీర్ సెల్వం కోరుతున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆయ‌న కోరుకున్న‌ట్లే ప‌ళ‌నిస్వామి వ‌ర్గం ఓకే అంటుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ప‌న్నీర్‌ ను ముఖ్య‌మంత్రి చేస్తే.. ప‌ళ‌ని స్వామిని ఉప ముఖ్య‌మంత్రిని చేస్తామ‌న్న ఆఫ‌ర్ ను ప‌న్నీర్ వ‌ర్గం తెర మీద‌కు తేనుంది. ఈ అంశంపై రెండు వ‌ర్గాలు ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రుపుతున్నా.. అవేమీ ఒక కొలిక్కి రాలేదు. ఈ నేప‌థ్యంలో గురువారం ఇరు వ‌ర్గాల మ‌ధ్య కీల‌క భేటీ జ‌ర‌గ‌నుంది. ఇరు వ‌ర్గాల ప‌ర‌స్ప‌ర అంగీకారంతో అధికారం బ‌దిలీ అయ్యే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అదే జ‌రిగితే.. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న‌ట్లే.

పార్టీ నుంచి దూరం జ‌రుగుతున్న‌ట్లుగా శ‌శిక‌ళ మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేసిన వైనంపై ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం సంతోషాన్ని వ్య‌క్తం చేస్తోంది. వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారిన దిన‌క‌ర‌న్ పార్టీ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన నేప‌త్యంలో.. చిన్న‌మ్మ‌.. దిన‌క‌ర‌న్ లు వారంత వారే పార్టీ నుంచి వైదొలుగుతార‌న్న అభిప్రాయాన్ని లోక్ స‌భ ఉప‌స‌భాప‌తి తంబిదురై స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం.

దిన‌క‌ర‌న్ త‌న‌కు తాను పార్టీ నుంచి వైదొలుగుతున్న‌ట్లుగా చేసిన ప్ర‌క‌ట‌న‌పై మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం సంతోషాన్ని వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. త‌మ వ‌ర్గం తొలి విజ‌యంగా అభివ‌ర్ణించ‌టం విశేషం. త‌మ ధ‌ర్మ‌యుద్దాన్ని కొన‌సాగించ‌టం ద్వారా.. ప‌ళ‌ని వ‌ర్గంతో రాజీ లేని తీరులో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌న్న మాట‌ను చెప్పిన‌ట్లైంద‌ని చెప్పాలి. మ‌రి.. ప‌న్నీర్‌కు అధికారాన్ని అప్ప‌గించేందుకు వీలుగా మ‌రోసారి ప‌ళ‌నిస్వామి వ‌ర్గంపై అదృశ్య‌శ‌క్తి ప్ర‌య‌త్నిస్తుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.అదృశ్య‌శ‌క్తి కానీ ప‌వ‌ర్ ఫుల్ గా వ్య‌వ‌హ‌రిస్తే ప‌ళ‌నిస్వామి.. ప‌వ‌ర్ ను ప‌న్నీర్‌కుఅప్ప‌గించే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఈ రోజు త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News