ఆప‌రేష‌న్‌ ఓరుగ‌ల్లు.. కేసీఆర్ త్రిశూల వ్యూహం!

Update: 2021-04-20 14:30 GMT
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో చావు త‌ప్పి, క‌న్ను లొట్ట‌బోయిన చందంగా త‌యారైంది టీఆర్ఎస్ పార్టీ ప‌రిస్థితి. రెండు ప‌దుల స్థానాలు వ‌స్తే గొప్పే అనుకున్న బీజేపీ.. ఏకంగా అధికారం కైవ‌సం చేసుకున్నంత ప‌ని చేసింది. ఆ ఊపుతో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు రాష్ట్ర‌ క‌మ‌ల ద‌ళ‌ప‌తి. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో కాస్త జోరు త‌గ్గిన‌ట్టుంది. రెండు స్థానాల్లోనూ గెలిచిన గులాబీ ద‌ళం.. ఇదే ఊపులో ఓరుగ‌ల్లులోనూ తిరుగులేని విజ‌యం సాధించి, బీజేపీది బ‌లుపు కాదు.. వాపే అని నిరూపించాల‌న్న ప‌ట్టుద‌ల‌గా ఉంది.

దీంతో.. గ‌త ఫ‌లితాన్ని పున‌రావృతం చేసేందుకు ప‌క్కా ప్లాన్ గీసిన‌ట్టు స‌మాచారం. గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మొత్తం 58 స్థానాల‌కు గానూ.. 44 చోట్ల జెండా ఎగ‌రేసి తిరుగులేని విజ‌యం సాధించింది టీఆర్ఎస్. బీజేపీ కేవ‌లం ఒక్క స్థానంతో స‌రిపెట్టుకుంది. కాంగ్రెస్ నాలుగు చోట్ల గెలిచింది. అయితే.. జీహెచ్ఎంసీ ఫ‌లితాలు ఇచ్చిన ఉత్సాహంతో.. సింగిల్ సీటు నుంచి.. మేయ‌ర్ సీటు దాకా వెళ్తామని చెబుతూ వ‌స్తోంది బీజేపీ.

ఆ మ‌ధ్య‌ వ‌రంగ‌ల్ లో ప‌ర్య‌టించిన బండి సంజ‌య్‌.. కేసీఆర్ పై ఇష్టారీతిన ఆరోప‌ణ‌లు చేశారు. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ ను మ‌ట్టి క‌రిపిస్తామ‌ని, కాక‌తీయ కోట‌పై కాషాయ జెండా ఎగ‌రేస్తామ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ సీటును కూడా కోల్పోవ‌డంతో దూకుడు త‌గ్గింది. అయితే.. ప్ర‌స్తుత ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఏమ‌ర‌పాటుకు అవ‌కాశం ఇవ్వొద్ద‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తోంది గులాబీద‌ళం.

ఇందులో భాగంగా.. వ‌రంగ‌ల్ గెలుపు బాధ్య‌త‌ను ముగ్గురి భుజాల మీద పెట్టార‌ట కేసీఆర్‌. వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు దాస్యం విన‌య్ భాస్క‌ర్, న‌న్నపునేని న‌రేంద‌ర్‌, అరూరి ర‌మేష్ ల‌కు ప్ర‌త్యేకంగా ఆదేశాలు జారీచేసిన‌ట్టు తెలుస్తోంది. గులాబీ జెండా ఎగిరేలా చూసే బాధ్య‌త మీ త్రిమూర్తులదేన‌ని చెప్పార‌ట కేసీఆర్‌. ఏ మాత్రం తేడా వ‌చ్చినా భ‌విష్య‌త్ రాజ‌కీయ జీవితంపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని సంకేతాలు ఇచ్చార‌ని తెలుస్తోంది.

దీంతో.. ఈ ముగ్గురు ఎన్నిక‌ల స‌మ‌రంలో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అధిష్టానం సూచ‌న‌ల‌తోపాటు త‌మ‌దైన వ్యూహాల‌తో దూసుకెళ్తున్నారు. మొత్తం కేటీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే నిర్ణ‌యాలు జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నారు. కేవ‌లం గెలుపు గుర్రాల‌కు మాత్రమే టిక్కెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించార‌ట‌. మొహ‌మాటాల‌కు తావులేద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా.. ఎన్నిక‌ల ఖ‌ర్చును అభ్య‌ర్థి స‌గం భ‌రిస్తే.. మిగిలిన స‌గం పార్టీ ఇస్తుంద‌ని చెప్పార‌ట‌.

ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు నిల‌బ‌డాల్సిన చోట‌.. ఆర్థిక బాధ్య‌త‌ల‌ను ఈ ముగ్గురే పంచుకోవాల‌ని కూడా సూచించింద‌ట అధిష్టానం. ఇవ‌న్నీ చేస్తూనే.. ఇత‌ర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న వారికి గాలం వేయాల‌ని ఆదేశాలు అందిన‌ట్టు స‌మాచారం. ఏం చేసైనా గ‌తం క‌న్నా ప‌ది సీట్ల‌ను ఎక్కువ‌గానే గెలిచి రావాల‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. దీంతో.. క‌త్తిమీద సాములా మారిన ఈ ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా ముగించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు త్రిమూర్తులు. మ‌రి, వారి త్రిశూల వ్యూహం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.
Tags:    

Similar News