సీఎం జగన్ నియోజకవర్గంలో దారుణం..నడిరోడ్డుపై సర్పంచ్‌ ను వేటకొడవళ్లతో !

Update: 2021-07-27 14:30 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్  రెడ్డి సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో దారుణమైన  ఘటన చోటుచేసుకుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌ ని పట్టపగలే నడిరోడ్డు మీద అత్యంత కిరాతకంగా ప్రత్యర్థులు నరికి చంపేశారు. కడప జిల్లా లింగాల మండలం కోమనూతల సర్పంచ్‌ దారుణహత్యకు గురయ్యారు. సర్పంచ్‌ ల శిక్షణా తరగతులకు హాజరయ్యేందుకు పులివెందులకు వెళ్లిన మునెప్పను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు.

అధిపత్య పోరుతోనే ఈ హత్య జరిగినట్టుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. వైసీపీకి చెందిన మునెప్ప, పులివెందుల నుంచి కోమన్నూతలకు వాహనంలో వస్తున్న సమయంలో దారికాసిన ప్రత్యర్థులు, వేటకొడవళ్లతో కాపు కాసి ఒక్కసారిగా గుక్కతిప్పుకునేలోపే ఈ హత్య చేశారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మునెప్పపై కక్ష పెట్టుకున్న వారే ఈ పని చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన మునెప్ప.. 150 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ క్రమంలో ఆధిపత్య పోరుతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News