పెరిగిన మోడీ గ్రాఫ్ ను లెవెల్ చేసేందుకు రంగంలోకి దీదీ!

Update: 2019-03-05 04:10 GMT
పాక్ తో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. మెరుపుదాడుల త‌ర్వాత ప్ర‌ధాని మోడీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. పాక్ పై మెరుపుదాడులు చేయించేందుకు వెనుకాడ‌క‌పోవ‌ట‌మే కాదు.. చ‌ర్య‌ల కోసం త్రివిధ ద‌ళాధిప‌తుల‌కు పూర్తి అధికారాల్ని క‌ట్ట‌బెడుతూ తీసుకున్న నిర్ణ‌యంపైనా ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. పాక్ తోక క‌త్తిరించేందుకు మోడీ వెనుకాడ‌లేద‌న్న ఇమేజ్ ను తాజా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ తో మోడీ తెచ్చుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే విష‌యాన్ని తాజాగా జ‌రిపిన స‌ర్వేలు కూడా స్ప‌ష్టం చేస్తున్నాయి.

పాక్ తో ఉద్రిక్త‌త‌ల ఎపిసోడ్‌ కు ముందు మోడీ ప‌రిస్థితి గ‌డ్డుగా ఉన్న‌ట్లుగా క‌నిపించింది. విప‌క్షాలు ఏకం కావ‌టం.. మోడీని ఓడించ‌ట‌మే లక్ష్యంగా పెట్టుకోవ‌టం.. అందుకు త‌గ్గట్లు రాష్ట్రాల వారీగా వ్యూహాలు సిద్ధం చేయ‌టం లాంటివి చేశారు. కానీ.. మెరుపుదాడుల అనంత‌రం ప‌రిస్థితులు మారిన‌ట్లుగా చెబుతున్నారు. అందుకు ఢిల్లీ రాష్ట్రంలోని రాజ‌కీయాలే నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు.

మెరుపుదాడుల‌కు ముందు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్ క‌లిసి పోటీ చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాయి. తాజా ప‌రిణామాల‌తో కాంగ్రెస్ తో క‌లిసేందుకు ఆమ్ ఆద్మీ అధ్య‌క్షుడు అర‌వింద్ కేజ్రీవాల్ వెన‌క‌డుగు వేస్తున్నార‌న్న మాట వినిపించింది. దీనికి త‌గ్గ‌ట్లే.. ఢి్ల్లీ రాష్ట్రంలోని ఏడు లోక్ స‌భా స్థానాల‌కు ఆమ్ ఆద్మీకి చెందిన ఆరుగురు అభ్య‌ర్థుల్ని కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. మెరుపుదాడుల‌కు ముందు మ‌హాకూట‌మి పేరుతో చురుకుగా వ్య‌వ‌హ‌రించిన విప‌క్షాల్లో ఇప్పుడు స్త‌బ్ద‌త నెల‌కొంది.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రేపో.. మాపో అన్న‌ట్లుగా ఉన్న ప‌రిస్థితుల్లో మ‌హాకూట‌మిలోని మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య పొత్తుల లెక్క తేల‌క‌పోవ‌టం.. చాలాచోట్ల ఎవ‌రికి వారే పోటీకి దిగాల‌న్న ఆలోచ‌న‌తో ఉండ‌టంతో కూట‌మి ఫ్యూచ‌ర్ ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఈ ప‌రిస్థితిని మార్చేందుకు ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ రంగంలోకి దిగిన‌ట్లుగా చెబుతున్నారు. ఆమెతో పాటు.. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్.. టీడీపీ అధినేత క‌మ్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. అయితే.. సొంత రాష్ట్రంలోనే చంద్ర‌బాబు ప‌రిస్థితి బాగోలేద‌ని.. దీంతో ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి సారించ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

రంగంలోకి దిగిన మమ‌త కూట‌మి బ‌లంగా ఉంద‌న్న భావ‌న క‌లిగించే ప్ర‌య‌త్నాల్లో త‌ల‌మున‌క‌లైన‌ట్లుగా తెలుస్తోంది. బెంగాల్ లో ఉన్న 42 లోక్ స‌భ స్థానాల్లో కాంగ్రెస్ తో క‌లిసి పోటీ చేసేలా  ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మ‌రోవైపు తృణ‌మూల్ కు బ‌ద్ధ‌శ‌త్రువైన సీపీఎంతో ఇప్ప‌టికే ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. దీంతో.. దీన్ని అధిగ‌మించ‌టం ఎలా? అన్న‌ది మ‌రో క్వ‌శ్చ‌న్ గా మారింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కూట‌మిలోని పార్టీల‌తో క‌లిసి పొత్తు పెట్టుకొని రంగంలోకి దిగాల‌న్న ప్లాన్ ఏకు భిన్నంగా ప్లాన్ బిబి అమ‌లు చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. కూట‌మిని అలా ఉంచి.. రాష్ట్రాల్లో ఎవ‌రికి వారుగా పోటీ చేయ‌టం.. గెలుపు మీద దృష్టి పెట్ట‌టం.. గెలిచిన త‌ర్వాత కూట‌మిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నం ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో బాగుంటుంద‌న్న భావ‌న ప‌లు పార్టీల్లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఈ వ్య‌వ‌హారం మీద రానున్న రోజుల్లో మ‌రింత క్లారిటీ రానుంది.
Tags:    

Similar News