మోడీ ప‌నిని సులువు చేసిన విప‌క్షాలు

Update: 2017-06-22 15:00 GMT
ప్ర‌త్య‌ర్థులు మ‌న‌ల్ని ఓడించ‌టం ఒక ప‌ద్ధ‌తి. ప్ర‌త్య‌ర్ధికి ఇబ్బంది క‌లిగించ‌కుండా ముందే చేతులు ఎత్తేయ‌టం ఇంకో ప‌ద్ధ‌తి. రెండింటిలో ఓట‌మి కామ‌న్ అయినా.. ఓడిన తీరులో చాలానే వ్య‌త్యాసం ఉంటుంది. తాజా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ఎపిసోడ్ విష‌యంలో కాంగ్రెస్ ఇత‌ర విప‌క్షాలు క‌లిసి ఎంపిక చేసిన రాష్ట్రప‌తి అభ్య‌ర్థిని చూస్తే ఇది నిజం అనిపించ‌క మాన‌దు.

రాష్ట్రప‌తి ఎన్నిక సంద‌ర్భంగా మోడీ ప్ర‌యోగించిన ద‌ళిత కార్డుకు ధీటుగా విప‌క్షాల‌న్నీ క‌లిసి ధీటైన ద‌ళిత అభ్య‌ర్థిని ఎంపిక చేస్తాయ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అస్థానానికి చెందిన ద‌ళిత నేత‌ల్ని రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేస్తార‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాన్ని చూస్తే.. విప‌క్షాలు రెండో ప్ర‌చారాన్ని నిజం చేశాడు. విప‌క్షాల రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ మీరా కుమార్‌ ను ఎంపిక చేశారు.

దీంతో.. ఎన్డీయే ప‌క్షం బ‌రిలోకి దించిన రామ్ నాథ్ కోవింద్ తో మీరాకుమార్ త‌ల‌ప‌డ‌నున్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన మెజార్టీని ఎన్డీయే ప‌క్షాలు ఇప్ప‌టికే పొందాయి. విజ‌యానికి అవ‌స‌ర‌మైన ఓట్ల‌కు కాసిన్ని ఓట్లు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్డీయే అభ్య‌ర్థికి ద‌న్నుగా నిలిచేందుకు టీఆర్ ఎస్‌.. త‌మిళ‌నాడు అధికార ప‌క్ష‌మైన అన్నాడీఎంకే (అమ్మ‌).. ప‌న్నీరు నేతృత్వంలోని అన్నాడీఎంకే ల‌తో పాటు బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌.. ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ లు మ‌ద్ద‌తు ఇవ్వ‌టంతో.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో మోడీ అండ్ కో అభ్య‌ర్థికి గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే కానుంది.

ఢిల్లీలోని పార్ల‌మెంట్ లైబ్ర‌రీ బిల్డింగ్ లో స‌మావేశ‌మైన విప‌క్ష నేత‌లు రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎన్నిక‌పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ స‌మావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌.. సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి.. సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి.. స‌మాజ్ వాదీ నేత రామ్ గోపాల్ యాద‌వ్‌.. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌.. డీఎంకే నేత క‌నిమొళి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌రోవైపు విప‌క్షాల అభ్య‌ర్థిగా అంబేడ్క‌ర్ మ‌న‌మ‌డ్ని తెర మీద‌కు తెస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగినా అది వాస్త‌వ రూపం దాల్చ‌లేదు. విప‌క్షాల అభ్య‌ర్థి అయిన మీరాకుమార్ విష‌యానికి వ‌స్తే.. యూపీఏ 2లో ఆమె లోక్ స‌భ స్పీక‌ర్ గా ప‌ని చేశారు. కేంద్ర‌మంత్రిగా సేవ‌లు అందించిన అనుభ‌వం ఆమె సొంతం. మాజీ ఉప ప్ర‌ధాని బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ కుమార్తే మీరాకుమార్ అన్న‌ది అంద‌రికి తెలిసిన విష‌య‌మే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News