ఒక్క ట్వీట్ రూ.81కోట్లు వచ్చేలా చేసింది

Update: 2016-01-28 22:30 GMT
ప్రముఖులు ఏం చేసినా కాసులే కాసులు. అయితే.. ఒక్క ట్వీటుకు అక్షరాల రూ.81.7కోట్లు సంపాదించొచ్చన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించి సంచలనం సృష్టించారు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్ ప్రే. ఆమె చేసిన ఒక్క ట్వీట్ భారీ మొత్తాన్ని సంపాదించి పెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకూ ఓఫ్రాకు రూ.81.7కోట్లు సంపాదించిన పెట్టిన ఆ ట్వీట్ ఏమిటి?.. దాని సారాంశమేంటి? ఒక్క ట్వీట్ తో అంత డబ్బు ఎలా సంపాదించొచ్చు? అన్న డౌట్ వచ్చిందా? అక్కడికే వస్తున్నాం.

వెయిట్ వాచర్స్ కంపెనీ తరఫున ఆమె ఒక ట్వీట్ చేసింది. దాని సారాంశమేమిటంటే.. బ్రెడ్ తినండి.. బరువు తగ్గండి. ఎలా అంటారా? నాతో పాటు ఓ 30 సెకన్లు ఈ వీడియో చూడండి అంటూ ట్వీట్ చేసింది. తాను బ్రెడ్ తినటంతో 26 పౌండ్ల బరువు తగ్గినట్లుగా ఆమె పేర్కొన్నారు. అమెరికాలో విశేష ఆదరణ ఉన్న ఓఫ్రా చేసిన ట్వీట్ తో అమెరికన్లతో పాటు.. ఆమెను ఫాలో అయ్యే వారంతా ఆమె పోస్ట్ చేసిన 30 సెకన్ల వీడియోను చూశారు. దీంతో.. సదరు కంపెనీకి ఆదరణ విపరీతంగా పెరిగింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె ప్రచారం చేసిన వెయిట్ వాచర్స్ కంపెనీలో ఆమెకు వాటా ఉంది.

అది కాస్తా ఆమె పెట్టిన ట్వీట్ పుణ్యమా అని వాటా విలువ ఒక్కసారి పెరిగిపోవటం.. ఆ పెరిగిన విలువ రూ.81.77 కోట్లకు సమానం కావటంతో.. అమ్మడి ట్వీట్ అంత సంపాదించి పెట్టినట్లైంది. ప్రముఖులు ఏం చేసినా కాసులే కురవటం గమనార్హం.
Tags:    

Similar News