టిక్కెట్‌ భాజపాదే వ్యూహం దేవయ్య సొంతం!

Update: 2015-11-06 18:24 GMT
తెదేపా భాజపా మిత్రపక్షాలు అయినప్పుడు వరంగల్‌ ఎంపీ స్థానం నుంచి పోటీచేయడానికి ఇద్దరూ పోటీపడిన తీరును గమనిస్తే.. ఆయా పార్టీల్లో అభ్యర్థిత్వం మీద ఆశలు పెట్టుకుని ఎందరు నాయకులు ఉన్నారో కదా.. వారిని సంతుష్టుల్ని చేయడానికి పార్టీలు ఇంతగా సీటుకోసం కొట్లాడుకుంటున్నాయి అనిపిస్తుంది. తెదేపా విషయంలో ఇది నిజమే. సీటు లభించి ఉంటే అక్కడ పోటీచేయడానికి వారికి పలువురు ఉన్నారు. కానీ.. సీటు దక్కించుకున్న భాజపాకు మాత్రం అభ్యర్థికి దిక్కులేకుండా పోయింది. ఏదో స్వదేశంలో దళితుల కోసం కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్నారై వైద్యుడు పగిడిపాటి దేవయ్యను దిగుమతి చేసుకుని అభ్యర్థిగా నిలబెట్టారు. విపక్షాలకు తద్వారా ఒక అస్త్రం అందించారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని వ్యక్తికి టిక్కెట్‌ ఇచ్చారని.. ఎన్నికల్లో గెలిచినా ఓడినా.. ఎంచక్కా మళ్లీ అమెరికా వెళ్లిపోతాడని ప్రచారం ఆల్రెడీ మొదలైపోయింది.

అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవయ్య భాజపా అభ్యర్థిగా వరంగల్‌ ఎన్నికల బరిలోకి ప్రవేశించినప్పటికీ.. తానొక కొత్త వ్యక్తిగా, పూర్తిస్థాయిలో ప్రచార వ్యూహాల కోసం భాజపా నాయకుల మీద డిపెండ్‌ అవుతున్న వ్యక్తిలాగా కనిపించడం లేదని ఆ ఆ పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది. నిజానికి కొత్త వ్యక్తి గనుక.. సమస్తం తమ కనుసన్నల్లోనే జరుగుతుందని రాష్ట్ర భాజపా నాయకులు, ఆయనను పిలిపించి టిక్కెట్‌ ఇచ్చిన వారు ఆశిస్తూ ఉండవచ్చు. అయితే.. మీరు తప్ప నాకు ప్రచార వ్యూహాలకు దిక్కులేదు అనే కలర్‌ ఇవ్వకుండా, దేవయ్య తనంతగా తాను యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంటున్నారట. శుక్రవారం నాడు భాజపా అధికారికంగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే గురువారం మొత్తం ఆయన తన వరంగల్‌ ఇంట్లో రెండు పార్టీలకు చెందిన జిల్లా రాష్ట్ర నాయకులతో పలు విడతలుగా చర్చలు జరిపి.. వ్యూహరచన ఖరారు చేసుకున్నారుట.

దేవయ్య మరీ ప్రతిపక్షాల వారు ఊహిస్తున్నంత అమాయకంగా ఏమీ లేడని.. ఎటూ డబ్బు కూడా బాగానే ఖర్చు పెట్టగల అభ్యర్థిగా బరిలోకి ప్రవేశించాడు గనుక.. అటో ఇటో తేల్చుకునే ఉద్దేశంతో గట్టిగానే తలపడుతున్నాడని పలువురు అంటున్నారు. భాజపా రాష్ట్ర నాయకత్వాన్ని సైడ్‌ లైన్‌ చేసి.. సొంతంగా వ్యూహరచన చేయడం బాగానే ఉందిగానీ.. పార్టీకి అక్కడ ఎంత బలం ఉందో.. అది ఆయనకు ఎంత లాభిస్తుందో చూడాలి.
Tags:    

Similar News