ఇమ్రాన్ చెంప చెళ్లుమనిపించిన పాక్ ప్రజలు .. అసలేమైంది

Update: 2019-11-02 10:05 GMT
ఒక సమస్య నుండి తప్పించుకోబోయి..ఇంకో సమస్యలో చిక్కినట్టు ఉంది ఇప్పుడు  పాక్ ప్రధాని పరిస్థితి. పాక్ లో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు. ఈ విషయం  యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ , పాక్ ప్రధాని ఇమ్రాన్ మాత్రం పాక్ ఆర్థిక పరిస్థితి అంతా బాగుంది అని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. దీనితో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహార తీరుపై  పాక్ ప్రజలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.  దేశంలో ఉన్న సమస్యలని పరిష్కారించలేని ప్రధాని కాశ్మీర్ గురించి ఆలోచించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా గాలప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ పాకిస్థాన్‌లో ఒక సర్వే చేసింది. ఈ సర్వే లో వెల్లడైన విషయాలని చూస్తే  ప్రస్తుతం పాక్ ఎటువంటి పరిస్థితుల్లో ఉందొ అర్థమౌతుంది.  

గత కొన్ని రోజులుగా పాక్ లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనితో తినడానికి కూడా సరైన ఆహారం దొరకడంలేదు. ఆకలితో అలమటిస్తున్న ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ..ప్రజల సమస్య కంటే కాశ్మీర్ సమస్యే ముఖ్యం అంటూ ఇతరదేశాలలో పర్యటిస్తున్నారు. ఇక ఈ సంస్థ చేసిన సర్వే  లో పాక్‌లో 53శాతం మంది ప్రజలు.. ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నట్లు తెలిపింది. 23శాతం మంది ప్రజలు నిరుద్యోగాన్ని, 4శాతం మంది ప్రజలు అవినీతిని, మరో 4శాతం మంది ప్రజలు నీటి కొరతను సమస్యగా భావిస్తున్నట్లు వెల్లడించింది.

రాజకీయ అస్థిరత, డెంగీ విజృంభణపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కశ్మీర్‌ని కేవలం 8శాతం మంది ప్రజలు మాత్రమే సమస్యగా భావిస్తున్నారని సర్వే కుండబద్దలు కొట్టింది. కశ్మీర్‌ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తి రాద్ధాంతం చేస్తున్న ఇమ్రాన్‌ ప్రభుత్వానికి కేవలం 8శాతం మంది ప్రజలు మాత్రమే మద్దతుగా నిలవడం గమనార్హం. పాక్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని గత జులైలో అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరించింది. అప్పటికి పాక్‌ ఖజానాలో కేవలం 8బిలియన్‌ డాలర్ల నిధులే ఉన్నాయి . అంటే అవి కేవలం 1.7 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్‌ 6బిలియన్‌ డాలర్ల బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీతో పాక్‌కు అండగా నిలిచింది. అలాగే చైనా, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ సైతం పాక్‌ సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సాయానికి ముందుకు వచ్చాయి.
Tags:    

Similar News