ఈ సీఎం మాట‌ల‌తో పాకిస్తాన్‌ కు షాక్ ఖాయ‌మే

Update: 2016-12-01 09:04 GMT
సంద‌ర్భం ఏదైనా కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును విమ‌ర్శించ‌డం, పాకిస్తాన్‌ కు అనుకూలంగా మాట్లాడ‌టంపై ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించే  జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఊహించని రీతిలో స్పందించారు. స‌రిహ‌ద్దు రేఖ స‌మీపంలోని నగ్రోటాలో జరిగిన ఉగ్ర దాడిలో ఒక మేజర్‌ సహా ఏడుగురు జవాన్లు అమరులయిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ఆరుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిన సంద‌ర్భాన్ని ప్ర‌స్తావిస్తూ  ఉడి ఉగ్ర ఘటన అనంతరం తీవ్రవాదులను ఏరివేయడానికి నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసినప్ప‌టికీ తీవ్రవాదులు భయపడడం లేదని ఒమ‌ర్ అబ్దుల్లా అన్నారు. తీవ్రవాదులను అణచివేయడానికి భారత ఆర్మీ చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ విఫలమైనట్టు ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్‌పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందో దేశ ప్రజలకు వివరిం చాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అయితే ఇదే సంద‌ర్భంలోనూ కేంద్ర ప్ర‌భుత్వం తీరుపై ఒమ‌ర్ అబ్దుల్లా మండిప‌డ్డారు. తీవ్రవాదుల బుల్లెట్లకు మన ఏడుగురు వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. అందుకే పాకిస్తాన్‌పై కేంద్రం అవలంబించే విధానాన్ని కచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉంది అని ఒమ‌ర్ తేల్చిచెప్పారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకిని చేయలేకపోయారని బీజేపీపై ఆయన ధ్వజమెత్తారు. అలా చేయ‌లేక‌పోవ‌డం వ‌ల్లే సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసినప్పటికీ, తీవ్రవాదులు తగ్గడం లేదని, మన జవాన్లను బలిగొంటూనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా నగ్రోటా ఉగ్ర దాడిలో చనిపోయిన ఆఫీసర్‌, జవాన్ల కుటుంబాలకు ఒమ‌ర్ అబ్దుల్లా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదిలాఉండ‌గా పెద్ద నోట్ల రద్దుతో పాటు నగ్రోటాలో జరిగిన సైనికులపై దాడి ఘటనపై చర్చించాలని  హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్ చేశారు.దేశంలో నిఘా వైఫల్యం కారణంగానే ఉగ్రవాదులు దాడులకు దిగుతున్నారని ఓవైసీ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పఠాన్‌కోట్‌, ఉరీ ఉగ్రవాద దాడుల ఘటన లు అందుకే జరిగాయని ఆయన పేర్కొన్నారు. నగ్రోటా దాడి సైతం ఇదే రీతిలో జరిగిందని పేర్కొంటూ ఈ దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News