జాదవ్ ఇష్యూను తెంచేందుకు పాక్ సిద్ధ‌మైంది?

Update: 2017-04-12 16:52 GMT
అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌ట‌మే కాదు.. లేనిపోని నేరాలు మోపి ఉరిశిక్ష విధించిన మ‌నోడు కుల్ భూష‌ణ్ జాద‌వ్ విష‌యంపై దాయాది పాకిస్థాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌ల‌తో జాద‌వ్‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌టం.. త‌ద‌నంత‌రం చోటుచేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల‌తో ఆయ‌న‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై భార‌త్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. ఉరిశిక్ష‌ను అమ‌లు చేస్తే.. అసాధార‌ణ ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని కేంద్ర విదేశాంగ‌మంత్రి సుష్మ‌స్వ‌రాజ్ స్ప‌ష్టం చేయ‌టం తెలిసిందే.

అయితే.. ఈ ఉదంతానికి ల‌భించిన అనూహ్య ప్ర‌చారంతో పాక్ కాస్తంత వెన‌క్కిత‌గ్గిన‌ట్లుగా క‌నిపించినా.. ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌కూడ‌ద‌న్న కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

భార‌త్ చేసిన హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో పాక్ సైన్యాధిప‌తి జ‌న‌ర‌ల్ ఖ‌మ‌ర్ జావెద్ బ‌జ్వాతో ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ స‌మావేశ‌మ‌య్యారు. జాదవ్ ఉరిశిక్ష విష‌యంలోఎలాంటి రాజీలు అవ‌స‌రం లేద‌ని.. ఎలాంటి ఒత్తిళ్ల‌కు లొంగ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా పాక్ మీడియా వెల్ల‌డించింది. జాదెవ్ ఎపిసోడ్ నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య తాజాగా మాట‌ల యుద్ధం సాగుతున్న‌సంగ‌తి తెలిసిందే.

జాద‌వ్‌కు అన్యాయం జ‌రిగితే ఊరుకునేది లేద‌ని.. ఎలాంటి ప‌రిణామాల‌కైనా తాము సిద్ధ‌మ‌ని భార‌త్ పేర్కొంది. అంతేకాదు.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల విష‌యంలోనూ త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌కు సిద్ధంగా ఉండాల‌న్న వార్నింగ్ కూడా చేశారు. ఈ నేప‌థ్యంలో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో.. భార‌త్ ఒత్తిడికి లొంగ‌కూడ‌ద‌ని.. మొండిగా వ్య‌వ‌హ‌రించాలన్న‌నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. ఈ ఉదంతంపై అమెరికా సైతం పాక్ తీరుపై అసంతృప్తితో ఉండ‌టం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News