దర్శిలో మొదలైన కరపత్రాల తొలనొప్పి

Update: 2020-11-26 17:30 GMT
వైసీపీలో రోజుకో తలనొప్పి బయటపడుతోంది. ఒకరోజు వైజాగ్ లో నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు. మొన్న కాకినాడలో డీఆర్సీ సమావేశంలో ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్-కాకినాడు ఎంఎల్ఏ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం. పై రెండు వివాదాలు కూడా చివరకు తాడేపల్లికి చేరుకుని జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే సర్దుబాటైంది. దీన్నీ జనాలు మరచిపోకముందే తాజాగా ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ఎంఎల్ఏ మద్దిశెట్టి వేణుగోపాల్ అవినీతి భాగోతమంటూ పాంప్లెట్లు పంచిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ విషయం ఏమిటంటే దర్శిలో ఎంఎల్ఏ మద్దిశెట్టికి మాజీ ఎంఎల్ఏ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మద్దతుదారులకు ఏమాత్రం పడదు. దాంతో ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏల మధ్య కూడా సరైన సంబంధాలు లేవు. వీళ్ళద్దరి మధ్య చాలా సార్లు చాలా విషయాల్లో గొడవలు అవుతునే ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా ఎంఎల్ఏపై కరపత్రాలు వేశారు. అందులో మద్దిశెట్టి అవినీతి, అక్రమాలంటూ కొన్ని ఉదాహరణలు చూపించారు. కమీషన్లు తీసుకుని టీడీపీ నేతలకు పనులు అప్పగిస్తున్నారని, సీఎం రిలీఫ్ ఫండులో కూడా చివరకు 30 శాతం కమీషన్లు దండుకుంటున్నట్లు పాంప్లెట్లలో ఉంది.

నియోజవర్గంలోని కురిచేడు మండలంలో వెళుతున్న బస్సులో నుండి పెద్ద ఎత్తున పాంప్లెట్లను బయటకు విసిరేసుకుంటు వెళ్ళారు కొందరు. వెళుతున్న బస్సులో నుండ కరపత్రాలను చల్లుకుంటు వెళ్ళారు కాబట్టి ఎవరు చేశారన్నది ఎవరికీ తెలీటం లేదు. బస్సులో నుండి బయటపడిన పాంప్లెట్లను చూసిన కొందరు ఎంఎల్ఏ అనుచరులు షాక్ తిన్నారు. దాంతో విషయాన్ని ఎంఎల్ఏకి చేరవేశారు.

విషయం గ్రహించిన మద్దిశెట్టి పాంప్లెట్లను తీసుకుని మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిని కలిశారు. పాంప్లెట్ల వ్యవహారమంతా బూచేపల్లి పనే అంటూ తనకున్న అనుమానాలను వివరించారు. దాంతో మంత్రి విషయాన్ని సీరియస్ గా తీసుకుని పోలీసులతో మాట్లాడారు. పాంప్లెట్ల ప్రింటింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై విచారణ జరపమని చెప్పారు. మరి పోలీసుల విచారణలో ఏమి తేలుతుందో చూడాల్సిందే. తర్వాత ఈ వివాదం కూడా నియోజకవర్గంలోనే సర్దుబాటు అవుతుందా లేకపోతే మళ్ళీ ఇదికూడా తాడేపల్లికి వెళ్ళాల్సిందేనా అని చూడాలి.
Tags:    

Similar News