పనామా లీక్స్: ఈడీ ఎదుట మరో సెలబ్రెటీ..?

Update: 2021-12-22 06:46 GMT
పనామా పేపర్స్ కేసు బాలీవుడ్ తారల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ కేసులో చిక్కుకున్న అమితాబ్ బచ్చన్ కుటుంబం ఇప్పటికే ఈడీతో విచారణను ఎదుర్కొంది. సోమవారం ఐశ్వర్యరాయ్ ను ఈడీ అధికారులు పలు ప్రశ్నలు వేసి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ వ్యవహారంలో వీరితో పాటు మరికొందరు నటులు ఉన్నారని ఎన్ఫర్స్మెంట్ డైరెక్టర్ వెల్లడించింది. విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టారని వారికి సంబంధించిన జాబితా మా వద్ద ఉందంటూ ఈడీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బచ్చన్ కుటుంబంతో పాటు అజయ్ దేవగన్ కూడా విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు. అయితే తమ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ గానే ఉన్నట్లు అజయ్ దేవగన్ కొందరితో అన్నట్లు సమాచారం.

2016లో పనామా నుంచి నడిచే ఓ లా కంపెనీకి చెందిన రూ.11.5 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ డాక్యుమెంట్స్ లీకయ్యాయి. ఇందులో పలువురు రాజకీయా నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖ సెలబ్రెటీల పేర్లు ఉన్నాయి. ఇందులో బచ్చన్ ఫ్యామిలీ పేరుకూడా ఉంది. పనామా పేపర్స్ లీక్ చేసిన సమాచారం ప్రకారం అమితాబ్ బచ్చన్ విదేశాల్లోని నాలుగు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. బహామాస్, వర్జిన్ లు వీటిలో ప్రముఖమైనవి.

1993లో స్థాపించిన ఈ కంపెనీలు మూలధనం 5 వేల నుంచి 50 వేల డాలర్లు. వీటి పెట్టుబడులు తక్కువగానే ఉన్నా వ్యాపారం పెద్ద ఎత్తున జరిగింది. ఇక వర్జిన్లో అమిత్ పార్ట్ నర్స్ పేరుతో ఉన్న కంపెనీలో ఐశ్వర్యరాయ్, ఆమె తండ్రి కె.రాయ్, తల్లి వృందా రాయ్, సోదరుడు ఆదిత్యరాయ్ లు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. 2005లో ప్రారంభించిన ఈ కంపెనీ మూడేళ్లపాటు నడిచి 2008లో మూసివేయబడింది.

ఆయా కంపెనీల్లో అమితాబ్ కుటుంబంతో సహా పలువురు సెలబ్రెటీలు పెట్టుబడులు పెట్టినట్లు పనామా పేపర్స్ తెలిపింది. దీంతో వీరు ట్యాక్స్ చెల్లించని కారణంగా అందులో ఇన్వెస్ట్ మెంట్ చేసిన భారతీయులను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నటి ఐశ్వర్యరాయ్ ని విచారించారు. ఢిల్లీలోని లోక్ నాయక్ భవనంలో విచారించిన అధికారులు ఆమెను పలు ప్రశ్నలు వేశారు. అయితే ఐశ్వర్యరాయ్ ఈ విషయంపై ఏవిధంగా స్పందించలేదు.

తాజాగా మరో సెలబ్రెటీని కూడా విచారించొచ్చు అని అంటున్నారు. ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవ్ గన్ కూడా ఈ వ్యవహారాల్లో ఈడీ ఎదుట హాజరు కావచ్చని అంటున్నారు. అయితే పనామా పేపర్స్ లీక్ సమయంలోనే వీరు వివరణ ఇచ్చుకున్నారు. ఈ సమయంలో అజయ్ దేవ్ గన్ మాట్లాడుతూ ‘బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో ఉన్న తన పెట్టుబడులకు సంబంధించి అన్నీ సక్రమంగానే ఉన్నాయి. ఈ విషయంలో ఆధారాలు కూడా ఉన్నాయి’ అని తెలిపాడు.

అయితే బచ్చన్ కుటుంబంలోని అమితాబ్ కూడా ఈడీ ఎదుట హాజరవుతారా..? అన్న చర్చ వస్తోంది. అయితే అమితాబ్ కూడా పనామా లీక్ సమయంలో వివరణ ఇచ్చారు. పనామా పేర్కొంటున్నట్లుగా తమకు ఎలాంటి కంపెనీలతో సంబంధం లేదని తెలిపాడు. అయితే పనామా లీక్ చేసిన 500 మంది ప్రముఖుల్లో బచ్చన్ పేరును కూడా ప్రస్తావించారు. వీటి ఆధారంగా ఇప్పటికే ఐశ్వర్యరాయ్ ను ఈడీ అధికారులు విచారించారు. దీంతో తరువాత అమితాబ్ ను కూడా విచారిస్తారని అంటున్నారు. ఆ తరువాత ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే అమితాబ్ అంతకంటే ముందే సరైన వివరాలు ఈడీ అధికారులకు అందజేస్తారా..? లేక మిగతా వారి లాగా ఈడీ ప్రశ్నలను ఎదుర్కొంటారా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags:    

Similar News