చైత‌న్య‌ - నారాయ‌ణ ర్యాంకుల‌ను త‌ల‌పిస్తున్న `పంచాయ‌తీ`

Update: 2021-02-22 06:30 GMT
ఒక‌టి-ఒక‌టి-ఒక‌టి, ఏడు-ఏడు-ఏడు, ప‌ది-ప‌ది-ప‌ది.. ఇది చ‌దువుతుంటే.. ఏం గుర్తుకు వ‌స్తోంది. ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ ర్యాంకులు విడుద‌లైన‌ప్పుడు.. ప‌లు విద్యాసంస్థ‌లు టీవీల్లో ఇచ్చుకునే ప్ర‌క‌ట‌న‌లు గుర్తుకు వ‌స్తున్నాయి క‌దా!! ఔను.. కీల‌క ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌లైన‌ప్పుడు.. చైత‌న్య‌, నారాయ‌ణ వంటి విద్యాసంస్థ‌లు త‌మ విద్యార్థుల‌కు వ‌చ్చిన ర్యాంకుల‌తో టీవీల్లో ప్ర‌క‌ట‌నల‌ను జోరెత్తించ‌డం మ‌న చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది. అయితే.. ఏంటి అంటున్నారా?  .. తాజాగా ఏపీలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల విష‌యంలో రాజ‌కీయ పార్టీలు కూడా ఇదే వైఖ‌రిని అవ‌లంబిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏపార్టీకి ఆ పార్టీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మాదంటే మాదే విజ‌యం అని.. మాకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని.. టీవీల్లో ఊద‌ర‌గొడుతున్నాయి. ప్ర‌క‌ట‌న‌ల‌తో హోరెత్తిస్తున్నాయి. దీనిని చూస్తున్న జ‌నాల‌కు.. గ‌తంలో ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ ర్యాంకులు విడుద‌లైన‌ప్పుడు.. చైత‌న్య‌, నారాయ‌ణ విద్యాసంస్థ‌లు చేసిన ప్ర‌క‌ట‌న‌లు గుర్తుకువ‌స్తున్నాయి. ఒకే ర్యాంకును ప‌దేప‌దే త‌మ‌కంటే త‌మ‌కే వ‌చ్చింద‌ని ఈ సంస్థ‌లు ప్ర‌చారం చేసుకోవ‌డం తెలిసిందే. ఇక‌, హాల్ టికెట్ల నెంబ‌ర్ల‌ను కూడా చెప్పి మ‌రీ యాడ్స్‌ను దంచికొట్టేవి.

అచ్చు.. అలాగే.. ఇప్పుడు అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు.. పోటా పోటీగా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ప్ర‌క‌ట‌నలు గుప్పిస్తున్నాయి. రెబ‌ల్స్‌, ఇండిపెండెంట్ల లెక్క‌ల‌తో స‌హా ఎవ‌రికి వారు.. ఇది మాలెక్క‌.. అంటే.. ఇది మాలెక్క‌.. అంటూ.. ప్ర‌క‌టించుకుంటున్నారు. టీడీపీ చెబుతున్న లెక్క‌ల్లో వైసీపీ వెనుక‌బ‌డి ఉంటే.. వైసీపీ చెబుతున్న లెక్క‌ల్లో టీడీపీ ఎక్క‌డో ఉంది. ఇక‌, వైసీపీ ఏక‌గ్రీవాల‌తో క‌లిపి లెక్క‌లు చెబుతుంటే.. టీడీపీ ఏక‌గ్రీవాల‌ను మిన‌హాయించి చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.  

ఈ నెల 9వ తేదీతో మొదలుకుని... ప్రతి దశలోనూ ఓటుకోసం జనం పోటెత్తారు. ఆదివారం జరిగిన చివరి విడతలో మూడు దశలను మించి పోలింగ్‌ నమోదైంది. పార్టీరహిత ఎన్నికలైనప్పటికీ అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి దశలోనూ సగటున 40 శాతం గ్రామాల్లో  తాము మద్దతు పలికిన అభ్యర్థులే విజయం సాధించారని టీడీపీ చెప్పుకొంది. అదేంకాదు... 80 శాతానికి పైగా గ్రామాల్లో తమ మద్దతుదారులే గెలిచారని, ఫలితాలను టీడీపీ వక్రీకరిస్తోందని వైసీపీ ప్రకటించుకుంది. ఏకగ్రీవాలతోపాటు రెబల్స్‌ విజయాలను కలిపి వైసీపీ లెక్కలు కట్టింది.

ఇక‌, పోలింగ్‌ జరిగిన స్థానాలను మాత్రమే టీడీపీ పరిగణనలోకి తీసుకుంది. పలుచోట్ల వైసీపీ రెబల్స్‌కు మద్దతు ఇచ్చి గెలిపించామంటూ... వాటినీ తమ ఖాతాలోకి వేసుకుంది. పార్టీ విధానాలతో సంబంధం లేకుండా పలు గ్రామాల్లో స్థానిక నేతలు ‘సర్దుబాట్లు’ చేసుకున్నారు. సర్పంచ్‌ - ఉపసర్పంచ్‌ పదవులు పంచుకున్నారు. కొన్నిచోట్ల టీడీపీ-జనసేన మధ్య అవగాహన కుదిరింది.

మరికొన్ని చోట్ల వైసీపీ రెబల్స్‌కు టీడీపీ నేతలు వ్యూహాత్మక మద్దతు ఇచ్చారు. పార్టీ రహితంగా సాగిన ఎన్నికలు కావడంతో... ఏ పార్టీ బలం ఎంత అనే విషయం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి! దీనిపై ఎవరి ప్రకటనలు వారివే! తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం వద్ద భారీ సంబరాలు జరిగాయి. ‘జగనన్నకు జనాభిషేకం... పంచాయతీలో పట్టాభిషేకం’ అంటూ ఆటపాటలతో చిందేశారు. ఇక... మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు కూడా ‘గెలుపు సంబరాలు’ చేసుకున్నారు. మొత్తంగా చూస్తే.. ఇదంతా ఎంసెట్ ఫ‌లితాల‌ప్పుడు వ‌చ్చే ప్ర‌క‌ట‌న‌ల‌నే త‌ల‌పించ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News