జ‌గ‌న్ హీరో...రోజా హీరోయిన్‌ గా సినిమా!

Update: 2017-07-13 03:31 GMT
ఏపీలో అధికార తెలుగుదేశం - ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. స‌హ‌జంగా అధికార, ప్ర‌తిపక్షాలంటే విమ‌ర్శ‌లు స‌హ‌జమే. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ తర‌ఫున చేసిన కామెంట్లు ఇబ్బందిక‌రంగా ఉన్నాయ‌నే మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార - ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ - తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విలేక‌రుల‌ సమావేశంలో మాట్లాడుతూ జగనేమో 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండాలని అత్యాశతో ఉన్నారని, ఆ పార్టీ నేత‌లు త‌మ‌దే అధికారం అనే భ్ర‌మ‌లో ఉన్నార‌ని అన్నారు. కానీ ప్ర‌జ‌లు ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌ర‌ని అనురాధ తెలిపారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి ఈ సంద‌ర్భంగా అనురాధ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  సభ్యసమాజం - మహిళలు సిగ్గుపడే విధానంలో మాట్లాడటం మంచి పద్ధతి కాదని అంటూనే అనురాధ కామెంట్లు చేశారు. అతిగా ఆవేశపడే ఆడది - అతిగా ఆశపడే మగాడు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవనే సినీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ రోజా హీరోయిన్‌ గాను - జగన్ హీరోగాను - విజయసాయిరెడ్డి స్క్రీన్‌ ప్లే - డైరెక్షన్‌ లోను ఒక సినిమా తీస్తే బావుంటుందని ఎద్దేవా చేశారు. ఈ క్ర‌మంలో వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ షర్మిల వ్యక్తిగత జీవితం - వివాహ జీవితంపై తాము ప్రశ్నిస్తే ఏ విధంగా ఉంటుందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అనురాధ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.
 
ఈ సంద‌ర్భంగా వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తూ మద్యనిషేధం - డ్వాక్రా మహిళల గురించి హామీలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉందని అనురాధ అన్నారు. 2004లో రాజశేఖర రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో అంచెలంచెలుగా మద్యపానం నియంత్రణ చేస్తామని నమ్మబలికారని చివరికి ఆనాడు రూ.3 వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని 30 వేల కోట్లకు పెంచిన ఘనత వైఎస్‌ ది అనే విషయం జగన్‌ కు గుర్తులేదా అని ప్రశ్నించారు. ఒక పక్క లిక్కర్ డాన్ బొత్స సత్యనారాయణను పక్కన కూర్చోబెట్టుకుని మద్యం గురించి  నీతులు మాట్లాడటం జగన్‌ కే చెల్లించిందన్నారు. మద్యం నియంత్రణపై చిత్తశుద్ధి ఉంటే బాధ్యతాయుతమైన కల్తీమద్యం కేసుల్లో ఉన్న ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో ఐదేళ్లలో రూ.650 కోట్లు డ్వాక్రా రుణాలు అందిస్తే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే రూ.6 వేల కోట్లను జమచేయడం జగన్‌ కు తెలియదా అని ప్రశ్నించారు.
Tags:    

Similar News