భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కొత్త CEO

Update: 2021-11-30 03:57 GMT
ట్విట్టర్.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. ఈ సామాజిక వేదిక భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. తాజా నివేదికల ప్రకారం, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ట్విటర్‌ సీఈవోగా పనిచేస్తున్న జాక్‌ డోర్సీ తన పదవి నుంచి వైదొలిగారు. కంపెనీకి ప్రస్తుత సీటీవోగా ఉన్న పరాగ్ అగర్వాల్ తక్షణం అమల్లోకి వచ్చేలా సీఈవోగా ఎంపికయ్యాడు. ఇది భారతీయులకు దక్కిన మరో ఘనతగా చెప్పొచ్చు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థలకు భారతీయులే సీఈవోగా ఉన్నారు. ఇప్పుడు అతిపెద్ద సోషల్ మీడియా ట్విట్టర్ కు మనోడే బాధ్యతలు చేపట్టడం విశేషం.

"ఎవరైనా విన్నారో లేదో ఖచ్చితంగా తెలియదు కానీ, నేను ట్విట్టర్‌కు రాజీనామా చేసాను" అనే క్యాప్షన్‌తో ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన జాక్ ట్విట్టర్‌లో ఒక ప్రకటనను చేశారు. ట్విట్టర్ సీఈవోగా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. జాక్ ఇలా రాశాడు, “నేను ట్విట్టర్‌ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే కంపెనీ దాని వ్యవస్థాపకుల నుండి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని నేను నమ్ముతున్నాను. ట్విట్టర్ సీఈఓగా పరాగ్‌పై నా నమ్మకం లోతైనది. గత 10 సంవత్సరాలుగా ఆయన చేసిన కృషి చాలా ఉంది. అతని నైపుణ్యం, మంచి మనసు, శ్రమ చేసిన తీరుకు నేను చాలా కృతజ్ఞుడను. ఇది అతనికి నాయకత్వం వహించే సమయం. ” అని జాక్ ప్రకటించారు.

పరాగ్ అగర్వాల్ 2011లో ట్విట్టర్‌లో చేరారు. 2017 నుండి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (CTO)గా పనిచేస్తున్నారు. పరాగ్ ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్.డీ పూర్తి చేసాడు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా భారతీయ సంతతికి చెందినవాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భారతీయ సంతతికి చెందినవాడు.ఇప్పుడు పరాగ్ చేరికతో ప్రపంచలోనే దిగ్గజ సంస్థలకు సీఈవోలుగా ఉన్న భారతీయుల సంఖ్య పెరిగినట్టైంది.





Tags:    

Similar News