ఎన్నిక‌ల వేళ ఈ అప‌శ‌కునాలేంటి సునీతమ్మ‌?

Update: 2019-02-08 05:49 GMT
మిగిలిన కాల‌మంతా ఎలా ఉన్నా.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసిన వేళ‌లో మాత్రం అంతా త‌మ‌కు అనుకూలంగా ఉండాల‌ని ప్ర‌తి నేతా భావిస్తుంటారు. ఏడాదికి ఒక‌సారి స్టూడెంట్‌కు ప‌రీక్ష‌లు వేధించిన‌ట్లే.. నేత‌ల‌కు ఐదేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఎన్నిక‌లు అగ్నిప‌రీక్ష‌గా మారుతూ ఉంటాయి. ఇటీవ‌ల కాలంలో మారిన రాజ‌కీయాల్లో ఒక్క‌సారి ప‌వ‌ర్ చేజారితో అంతే అన్న‌ట్లుగా మారిన ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. ఎన్నిక‌ల్లో గెలుపు కీల‌కంగా మారింది.

మ‌రో నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలో ఏపీ అసెంబ్లీకి.. లోక్ స‌భ‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ముందుగా అనుకున్న‌ట్లుగా ఎన్నిక‌ల షెడ్యూల్ ఈ నెలాఖ‌రులోనే వ‌చ్చేసే ప‌రిస్థితి. షెడ్యూల్ విడుద‌లైంది మొద‌లు ఎన్నిక‌ల వేడి ముదిరిన‌ట్లే. ఇంత కీల‌క‌మైన వేళ‌లో ఏపీ మంత్రి ప‌రిటాల సునీత‌మ్మ‌కు కాలం క‌లిసి రావ‌టం లేదా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. వ‌రుస పెట్టి చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఒక‌ప‌క్క అధినేత చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తి ఒక ఎత్తు అయితే.. సునీత‌మ్మ ప‌నితీరు ఏ మాత్రం బాగోలేద‌న్న మాట అనంత‌పురం జిల్లా వాసులు బ‌లంగా చెబుతున్నారు. మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ప‌రిటాల సునీత గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో త‌మ‌ను చూసిందే లేద‌ని.. త‌మ స‌మ‌స్య‌లు ప‌ట్టించుకున్న‌దే లేదంటూ అనంత‌పురం జిల్లాలో చేప‌ట్టిన నిర‌స‌న‌లు ఆమెకు ఇబ్బందిక‌రంగా మారాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆమెకు మ‌రో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ప‌రిటాల ర‌వీంద్ర‌కు ముఖ్య‌మైన అనుచ‌రుడిగా.. సునీత‌మ్మ‌కు బ‌ల‌మైన అండ‌గా చెప్పే ఆమె అనుచ‌రుడు వేప‌కుంట రాజ‌న్న తాజాగా టీడీపీకి గుడ్ బై చెప్పారు. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలో చేర‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీలో చేరారు. ఆయ‌నకు పార్టీ కండువా క‌ప్పిన జ‌గ‌న్‌.. పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. రాజ‌న్న చేరిక‌తో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లం మ‌రింత పెరిగింద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

రానున్న రోజుల్లో స‌ముచిత ప‌ద‌వి ఇచ్చి రాజ‌న్న‌ను గౌర‌విస్తామ‌న్న జ‌గ‌న్ మాట‌లు ఎలా ఉన్నా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ.. ప‌రిటాల సునీత‌మ్మ‌ను వ‌దిలేసిన రాజ‌న్న తీరు ఆమె శిబిరానికి భారీ షాక్ గా చెబుతున్నారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా మంత్రి ప‌రిటాల సునీత‌మ్మ‌కు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌హిళ‌ల నిరస‌న‌తో ప‌రిటాల వ‌ర్గీయులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఇటీవ‌ల డ్వాక్రా మ‌హిళ‌ల‌పై సునీత‌మ్మ సోద‌రుడు ముర‌ళీ తీరుపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు ఓటు వేస్తామ‌ని మ‌హిళ‌లు ప్ర‌మాణం చేయాల‌ని ప‌రిటాల వ‌ర్గీయులు అడగ్గా..అందుకు నో చెప్ప‌టంతో వారు చెల‌రేగిపోయారు. త‌మ మాట కాద‌న్న మ‌హిళ‌ల‌పై రాళ్లు రువ్విన వైనం సోష‌ల్ మీడియాలో వీడియోలో రూపంలో వైర‌ల్ గా మారింది. ఈ ఉదంతానికి బాధ్యులుగా సునీత‌మ్మ సోద‌రుడు ముర‌ళీగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. స్వ‌యంగా సునీత‌మ్మ‌కు సైతం మ‌హిళ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోని తోపుదుర్తిలో ప‌సుపు.. కుంకుమ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆమెపైన ప‌లువురు చెప్పులు విసిరిన వైనం సంచ‌ల‌నంగా మారింది. ఎన్నిక‌ల ముందు త‌మ‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్పి బాబు మోసం చేశారంటూ మండిప‌డుతున్నారు.

బాబు త‌మ‌ను మోసం చేశార‌ని.. మంత్రి సునీత‌మ్మ త‌న ప‌ద‌వీ కాలంలో ఎప్పుడూ త‌మ ప్రాంతంలో ప‌ర్య‌టించ‌లేద‌న్నారు. ఈ క్ర‌మంలో సునీతమ్మ‌పైనా.. బాబుపైనా ఉన్న కోపం ఆమె కాన్వాయ్ మీద ప్ర‌ద‌ర్శించారు. చెప్పులు విసురుతూ నిర‌స‌న వ్య‌క్తం చేసిన తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.


Tags:    

Similar News