షెడ్యూల్ కు 5 రోజుల ముందే పార్లమెంటు సమావేశాలు ముగించేశారు

Update: 2022-08-09 04:35 GMT
వర్షాకాల సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్ కంటే ముందే ముగిశాయి. సమావేశాల ఆరంభంలో అనుకున్న దానికి ఐదు రోజుల ముందే ఉభయ సభల్ని ముగిస్తూ నిర్ణయం తీసుకోవటంతో పాటు.. అందుకు తగ్గట్లే కార్యక్రమాల్ని పూర్తి చేశారు. సభల్ని నిర్ణీత గడువు కంటే ముందు ముగించాలన్న నిర్ణయాన్ని తీసుకొని.. అమలు చేశారు. సభల్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా సోమవారమే ప్రకటించారు స్పీకర్.. రాజ్యసభ ఛైర్మన్ లు. ఎందుకిలా? సభలు జరిగేవే కొద్ది రోజులు.. వాటిల్లోనూ కోత పడటం ఎందుకు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయి.

గడువుకు ఐదు రోజుల ముందే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పినప్పటికీ.. వాస్తవంగా చూస్తే ఐదు రోజుల్లో రెండు సెలవలు (ఆగస్టు 9న మొహర్రం.. ఆగస్టు 11న రక్షాబంధన్) రావటంతో సభలు జరిగే అవకాశం లేదు. మిగిలిన మూడు రోజుల కోసం ఆగస్టు 12 వరకు పని చేసే కంటే.. కాస్త ముందుగానే ముగిస్తే ఎంపీలు తమ స్వస్థలాలకు వెళ్లే వీలుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు.

మొహర్రం.. రక్షాబంధన్ కోసం ఎంపీలు తమ స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే.. ముందుగా విన్నవించుకున్న సభ్యుల వినతికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఐదు రోజుల ముందుగానే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి.. సభల్ని ముగించారు. షెడ్యూల్ ప్రకారం చూసినప్పుడు జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావేశాలు జరగాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ధరల పెరుగుదల అంశంతో పాటు.. విపక్షాల నిరసనలతో తొలి రెండు వారాల పాటు సభా కార్యకలాపాలు జరిగిందే లేదు. మొత్తంగా చూస్తే.. వారం పాటే సమావేశాలు సాగినట్లుగా పేర్కొంటున్నారు. ఈ సమావేశాల సందర్భంగా మొత్తం ఏడు చట్టాలకు ఆమోదం పలికినట్లుగా చెబుతున్నారు. ఈసారి సమావేశాల్లో హైలెట్ పాయింట్లు చూస్తే.. ధరల పెంపుపై విపక్షాలు నిరసనలు చేపట్టటం.. నిత్యం నిరసనలతో నినాదాలతో సభ దద్దరిల్లింది. సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలోనే ఉంటూ నిరసన చేపట్టారు.

రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. వాటి ఫలితాల విడుదల కావటం తెలిసిందే.రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అభ్యంతరకర వ్యాఖ్యలతో అతని చేత క్షమాపణలు చెప్పించటంలో బీజేపీ వర్గాలు సక్సెస్ అయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభల్లో భారీ ఎత్తున ఆందోళనను నిర్వహించారు కమలనాథులు. ఇక.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన ఖరీదైన బ్యాగ్ ను.. ధరల చర్చ సందర్భంగా టేబుల్ కింద దాయటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు పార్లమెంటు సంతాపం తెలియజేసి.. తన సంఘీభావాన్ని వ్యక్తం చేసింది.

వర్షాకాల సమావేశాల్లో లోక్ సభ మొత్తం 16 రోజులు మాత్రమే సమావేశమైంది. సంతృప్తికరంగా సమావేశాలు సాగినట్లుగా లోక్ సభ స్పీకర్ వెల్లడించారు. ఇక.. తన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పదవీ విరమణ చేయనున్న వెంకయ్యనాయుడు రాజ్యసభ కార్యకలాపాల గురించి వివరించారు. రాజ్యసభ మొత్తం 38 గంటలు పని చేసింది. 47 గంటల కంటే ఎక్కువగా వాయిదాలతోనే టైం వేస్ట్ అయ్యిందన్నారు.
Tags:    

Similar News