దిగ్గజ నేతలకు విభజన దెబ్బ...?

Update: 2022-01-30 02:30 GMT
రాజకీయాల్లో జాతకాలు మారుతూ ఉంటాయి. నిన్న ఉన్న పరిస్థితి నేడు ఉండదు. ముఖ్యంగా  విభజన దెబ్బ అలా ఇలా పడదు, ఉమ్మడి ఏపీ విభజనతో ఏకంగా దేశంలోనే అతి పెద్ద పార్టీ, వృద్ధ పార్టీ అయిన కాంగ్రెస్ ఏపీలో ఏమీ కాకుండా పోయిన వైనం ఉంది. ఇపుడు ఏపీలో జిల్లాల విభజనతో కూడా చాలా మంది దిగ్గజ నేతల జాతకం తారు మారు అవుతోంది. శ్రీకాకుళం జిల్లా విషయమే తీసుకుంటే ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు పొలిటికల్ గా భారీ దెబ్బ తగిలింది అనే చెప్పాలి.

కళా వెంకటరావు 1983 నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్రా జిల్లాలకు సంబంధించి అతి పెద్ద పదవి అయిన హోం శాఖను ఉమ్మడి ఏపీలో చేపట్టారు. ఇక అనేక పర్యాయాలు గెలిచిన కళా రాజ్యసభ మెంబర్ గా కూడా పనిచేశారు. ఇంతటి సీనియర్ మోస్ట్ నేతకు శ్రీకాకుళం జిల్లా మూడు ముక్కలు కావడంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పకతప్పదు.

కళా వెంకటరావుకు శ్రీకాకుళం జిల్లాలో పట్టున్న రెండు నియోజకవర్గాలు ఇపుడు పక్క జిల్లాలకు తరలిపోయాయి. రాజాం విజయనగరం జిల్లాలో కలుస్తూండగా, పాలకొండ వెళ్ళి కొత్తగా ఏర్పాటు చేస్తున్న పార్వతీపురం మన్యం జిల్లాలో మెర్జ్ అవుతోంది. ఈ రెండు చోట్లా కళాకు బాగా బలం ఉంది. ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇపుడు పక్క జిల్లాకు ఈ నియోజకవర్గం పోవడంతో కళా వర్గం పరిస్థితి ఏంటో అర్ధం కావడంలేదుట.

అలాగే రాజాం నుంచి కళా వెంకటరావు ఇప్పటికి అయిదు సార్ల్లు గెలిచారు. ఆయన 1983లో తొలిసారి అక్కడే విజయఢంకా మోగించారు. అలాంటి సీటు 2009 ఎన్నికల తరువాత ఎస్సె రిజర్వుడు కావడంతో ఆయన ఎచ్చెర్లకు రావాల్సి వచ్చింది. ఇక రాజాం లో బలమైన అనుచరులు ఉన్నా కళా విజయనగరం జిల్లాలో పాలిటిక్స్ చేయలేరు, అప్పటికే అక్కడ విజయన‌గరం జిల్లా టీడీపీ నేతలుచాలానే ఉంటారు. దాంతో కళా తనకు పెద్దగా బలం లేని నాన్ లోకల్ ముద్ర ఉన్న ఎచ్చెర్లలోనే సర్దుకోవాల్సి వస్తోంది అంటున్నారు.

ఇక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో కళాకు కానీ ఆయన వారసుడికి కానీ టికెట్ ఇచ్చే విషయంలో అధినాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. గతంలో అయితే జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో బలమున్న నేతగా కళా ఉండేవారు కాబట్టి మాట చెల్లుబాటు అయ్యేది, ఇపుడు ఆయన కేవలం సింగిల్ సీటుకే పరిమితం అవుతారు కాబట్టి పొలిటికల్ గా ఆయనకు ఎంత మేరకు ప్రయారిటీ దక్కుతుంది అంటే చెప్పలేరు.

వైసీపీలో మరో  రాజకీయ కుటుంబం కూడా ఈ విభజన వల్ల నష్టపోతోంది. పాలవలస రాజశేఖరం కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉంటూ రాజాం నుంచి తమ రాజకీయాన్ని పాండించుకుంది, 1962 నుంచి ఆ ఫ్యామిలీ రాజాం లో గెలుస్తోంది. ఇక పాలకొండ అంటే పూర్తిగా వారి పట్టుతోనే అక్కడ ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఏగరేస్తుంది. ఇపుడు ఆ రెండూ పక్క జిల్లాలకు పోవడంతో ఫ్యూచర్ లో శ్రీకాకుళంలో పెద్ద లీడర్ కావాలనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కి కూడా ఇబ్బందిగా మారుతోంది. మొత్తానికి ఉన్న జిల్లాలో పవర్ తగ్గిపోయిన ఈ దిగ్గజ నేతలు, వారి కుటుంబాలు మాత్రం విభజనతో అల్లాడిపోతున్నాయి అనే చెప్పాలి.

Tags:    

Similar News