పవన్ ఎక్కడా? ‘ఆన్ లైన్’ ప్రచారమేనా?

Update: 2021-03-08 06:47 GMT
పంచాయతీ ఎన్నికల్లోనూ పవన్ కనిపించలేదు.. ప్రచారం చేయలేదు. కానీ జనసైనికులే ఓన్ చేసుకొని సర్పంచ్ లను భారీగా గెలిచేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ పవన్ జాడ కనిపించడం లేదు. అయినా జనసైనికులే ఇప్పుడు కూడా ముందట పడి ప్రచారం చేసుకుంటున్నారు.. పవన్ ఎక్కడ? అన్న ప్రశ్న ఇప్పుడు జనసేనలో సాగుతోంది.

ఓ వైపు 70 ఏళ్ల వృద్ధాప్యంలోనూ ఎండల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తిరుగుతూ మున్సిపల్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓవైపు వైసీపీ మంత్రులు, కీలక నేతలు కూడా రోడ్డున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నా జనసేనాని పవన్ మాత్రం వీడియోలు రిలీజ్ చేస్తూ జనసేన గెలుస్తుందని ఆన్ లైన్ లో ప్రచారం కానిచ్చేస్తున్నారు. ఇటీవల విశాఖలో వైసీపీ తీరును ఎండగట్టి జనసేన నాయకులు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీని సంస్థాగతంగా విస్తరించకుండా.. బలోపేతం చేయకుండా.. యువతను ఆకర్షిస్తానని చెబుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్  ఇప్పటివరకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి దిగకపోవడం జనసైనికుల్లో నైరాశ్యాన్ని  నింపుతోంది. నిజానికి పవన్ విశాఖలో పర్యటించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో స్పందించాలని జనసేన నేతలు కోరుతున్నా.. పవన్ ఒక వీడియో విడుదల చేసి మమ అనిపించేశారు..

ఇక విజయవాడ, గుంటూరు వంటి రాజధాని ప్రాంతాల్లో కూడా పవన్ పర్యటించాలని కొందరు జనసేన నేతలు కోరారట.. ఎన్నికలకు ముందు వస్తానన్న జనసేనాని సినిమా బిజీల్లో పడి రాలేకపోతున్నారట..

మరో రెండు రోజుల్లోనే ఎన్నికల పోలింగ్ ఉంది. ఈ క్రమంలో జనసేన తరుఫున పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికల్లో యువ నేతలు పోటీచేస్తున్నారు. అయితే పవన్ ఒక్కసారైనా సుడిగాలి ప్రచారం చేయాలని.. మంచి ప్రభావం చూపుతుందని చెబుతున్నా.. ఆయన మాత్రం కదిలి రావడం లేదు. ఇక జనసేన నంబర్ 2 నాదెండ్ల మనోహర్ సైతం కనిపించకపోవడం జనసేన నేతల్లో నైరాశ్యం నింపుతోంది. ప్రకటనలు, సందేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇది జనసేనకు మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుందా అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News