ప‌వ‌న్ `సంస్కార` డైలాగ్ లు ఎన్నాళ్లు?

Update: 2017-12-07 17:56 GMT
2008 లో భారీ అంచ‌నాల న‌డుమ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన‌ ప్ర‌జారాజ్యం పార్టీ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలలో పెను ప్ర‌కంప‌నలు రేపుతుంద‌ని అంతా భావించారు. ఆ పార్టీ ఆవిర్భావ స‌భ‌కు వ‌చ్చిన (ప‌దిల‌క్ష‌ల మంది) జ‌న ప్ర‌భంజ‌నాన్ని చూసి చిరంజీవి త‌ప్ప‌క సీఎం అవుతార‌ని చాలామంది భావించారు. అయితే, అనూహ్యంగా ఆ పార్టీ 2009 ఎన్నిక‌ల్లో కేవ‌లం 18 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత‌, 2011లో కాంగ్ర‌స్ లో విలీన‌మైంది. అయితే, ప్ర‌జారాజ్యం విఫ‌ల‌మ‌వ‌డానికి కార‌ణం చిరంజీవి చుట్టు ఉన్న స్వార్థ‌ప‌రులేన‌ని జ‌న‌సేన అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఆయ‌న చుట్టు నిస్వార్థ‌ప‌ర‌మైన వ్య‌క్తులు ఉండి ఉంటే చిరంజీవిగారు ఈ పాటికి ముఖ్య‌మంత్రి అయి ఉండేవార‌ని చెప్పారు. రాజ‌మండ్రిలో జ‌న‌సేన స‌మ‌న్వ‌యక‌ర్త‌ల భేటీలో ప‌వ‌న్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అన్నయ్య చిరంజీవికి ప్రజలకు మంచి చేయాలనే తపన ఉందని, ఆయ‌న నిస్వార్థ‌మైన, కోట్లాది మంది ప్రజల ఆదరణ ఉన్న వ్యక్తి అని చెప్పారు.  ఒక‌వేళ చిరంజీవి గారి చుట్టూ నిస్వార్థపరులైన వ్యక్తులు ఉండి ఉంటే, ఈ పాటికి ప్రజా రాజ్యం పార్టీ అలాగే ఉండేదని, చిరంజీవి ముఖ్యమంత్రిగా ఉండేవారని అన్నారు. కేవలం పిరికి తనం వ‌ల్లే పీఆర్పీ దెబ్బతిందన్నారు. సైద్ధాంతిక బలం లేకపోవడంతోనే ఇబ్బందిప‌డ్డామ‌న్నారు. రూ.100 కోట్ల‌తో రాత్రికి రాత్రే త‌న పార్టీ నిర్మాణం చేసే స‌త్తా త‌న‌కుంద‌న్నారు. విలువలతో కూడిన రాజకీయం ఉండాలని - సంస్కారవంతగా మాట్లాడాలని బూతులు తనకూ వచ్చ‌ని - అందరికంటే ఎక్కువే మాట్లాడతాన‌ని చెప్పారు. బూతులు తిట్టుకుంటానంటే ప్రజలకు త‌ప్పుడు సంకేతాలు వెళతాయని  అన్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కులు - పార్టీలు జుగుప్సాక‌రంగా త‌యార‌య్యాయ‌ని - మ‌హిళ‌లు - చిన్న పిల్ల‌లు టీవీలు ఆన్ చేయాలంటేనే ఇబ్బందిప‌డుతున్నార‌ని చెప్పారు. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, వెట‌కార వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు గుప్పించ‌డ‌మే రాజ‌కీయం కాద‌ని అన్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఇన్ని విష‌యాలు చెప్పిన ప‌వ‌న్ ......బ‌హిరంగంగానే ప్ర‌జారాజ్యం పార్టీ నేప‌థ్యంలో కొంత‌మందిని గుర్తుపెట్టుకున్నాన‌ని, వారికి త‌గిన సమ‌యంలో బుద్ధి చెబుతాన‌ని వ్యాఖ్యానించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బో ఒక‌సారి గ‌మ‌నించుకోవాలి. రాజ‌కీయాల‌న్న త‌ర్వాత ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై, నేత‌ల‌పై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేయ‌డం సాధార‌ణ విష‌యం. ఆ మాట‌కొస్తే ప‌వ‌న్ కూడా వైసీపీ నేత జ‌గ‌న్ పై, సీఎం చంద్ర‌బాబుపై , బీజేపీపై ఘాటుగానే విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇపుడు ప‌వ‌న్ చెబుతున్న పార్ల‌మెంట‌రీ లాంగ్వేజ్ ఎన్నాళ్లు కొన‌సాగిస్తారో అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ప‌వ‌న్ భ‌విష్య‌త్తులో మ‌రింత‌మంది నేత‌ల‌పై, తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. అదే స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థుల నుంచి ప్ర‌తి విమ‌ర్శ‌ల‌నూ ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాలి. ఇప్ప‌టికే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ, వైసీపీ, బీజేపీ ల నుంచి ఘాటైన ప్ర‌తి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గురివింద న‌లుపు దానికి క‌నిపించ‌ద‌న్న సామెత ప‌వ‌న్ కు స‌రిగ్గా స‌రిపోయేలా ఉంది. వాటికి ప‌వ‌న్ ఇంతే సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా, సంస్కార‌వంతంగా స‌మాధానం చెబుతారా అన్న ప్ర‌శ్న‌త‌లెత్త‌క మాన‌దు. ఏదేమైనా ప‌వ‌న్ ప్ర‌జారాజ్యం గురించి, రివేంజ్ ల గురించి మాట్లాడి తేనెతుట్టెను క‌దిల్చార‌నే ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అప్పుడెపుడో జ‌రిగిన దానికి రిటార్ట్ గా జ‌న‌సేన పార్టీ పెట్టారా అన్న‌రీతిలో కొంద‌రు మాట్లాడుకుంటున్నారు. ఇక సొంత‌పార్టీ నేత‌లంద‌రితో ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయ‌బోతున్న నేప‌థ్యంలో అనేక వెన్నుపోట్లు, ఆటుపోట్లు త‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం ఉంది. వీట‌న్నింటినీ త‌ట్టుకొని ప‌వ‌న్ ఎంత వ‌ర‌కు బ‌రిలో నిలుస్తారో అన్న ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధానం ఇవ్వాలి.
Tags:    

Similar News