జనసేనాని దూకుడు .. యాత్రకు 8 కార్ల కాన్వాయ్ రెడీ!

Update: 2022-06-13 03:21 GMT
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ దూకుడు పెంచేశారు. అక్టోబర్ 5 నుంచి ప్రారంభించనున్న రాష్ట్ర యాత్రకు సంబంధించి 8 కొత్త స్కార్పియో కార్లు వచ్చేశాయి. ఈ కొత్త 8 కొత్త కార్ల కాన్వాయ్ తో పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ 8 కార్లు ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. దీంతో జనసేన శ్రేణుల్లో, పవన్ కల్యాణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

అక్టోబర్ 5 నుంచి మొదలుకానున్న యాత్రలో పవన్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలుస్తోంది. అన్ని ముఖ్య పట్టణాలు, నగరాలను కవర్ చేసేలా పవన్ యాత్ర సాగుతుందని సమాచారం. ఇందులో భాగంగా పవన్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలను ఎత్తిచూపుతారు. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొంటారు.

 ఇప్పటికే జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో పవన్ కల్యాణ్ వివిధ జిల్లాల్లో పర్యటించారు. ఆత్మహత్యలకు కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇందుకోసం పవన్ రూ.5 కోట్ల తన సొంత నిధులను వెచ్చిస్తుండటం గమనార్హం. అలాగే ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల పిల్లల చదువుల నిమిత్తం కూడా ఒక భారీ నిధిని పవన్ ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తులకు సంబంధించి మూడు ఆప్షన్లు ప్రకటిస్తే వీటిపైన బీజేపీ, టీడీపీ నేతలు స్పందించకపోవడం పవన్ కు ఆగ్రహం కలిగించిందని చెబుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా తాత్సారం చేస్తోందని అంటున్నారు.

పైగా కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన జేపీ నడ్డా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావాలని పార్టీ నేతలకు కర్తవ్య బోధ చేశారు. బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి కార్యకర్తలంతా కష్టపడాలని కోరారు. ఎక్కడా జనసేనతో పొత్తు విషయం కానీ, సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రస్తావన కానీ నడ్డా తేలేదు.

మరోవైపు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పొత్తుల విషయంలో వన్ సైడ్ లవ్వని చెప్పారు. ఇప్పుడు మహానాడు, బాదుడే బాదుడు విజయవంతం కావడంతో తమకు ఎవరితో పొత్తులు అవసరం లేదనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పొత్తుల ప్రకటన చేస్తే చంద్రబాబు స్పందించలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆయా పార్టీలకు తన సత్తా చూపించాలనే లక్ష్యంతో పార్టీ బలోపేతానికి, తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి మార్గం వేసుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే జనసేనాని దూకుడు పెంచారని వివరిస్తున్నారు. ఇందులో భాగంగానే 8 కార్ల కొత్త కాన్వాయ్ రెడీ అయ్యిందని చెబుతున్నారు.
Tags:    

Similar News