మార్చిలో పవన్ ‘ఆత్మ గౌరవ నిరసన’

Update: 2017-01-28 05:33 GMT
ఏపీకి ప్రత్యేక హోదాపై విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించాలనుకున్న శాంతి నిరసనను ఏపీ సర్కారు.. పోలీసులు ఎంతలా భగ్నం చేసింది తెలిసిందే. శాంతిభద్రతల బూచీతో పాటు.. గణతంత్రపు దినోత్సవం రోజున ఇలాంటి నిరసనలతో ఏదైనా జరగరానిది జరిగితే ఇబ్బంది అవుతుందన్న పేరుతో.. నిరసనకారులు రోడ్ల మీదకు రాకుండా చేయటంలో ఏపీ పోలీసులు సక్సెస్ కావటం తెలిసిందే.

పోయిన చోటే వెతుక్కోమని చెప్పే తీరుకు తగ్గట్లే.. ఏ ఆర్కే బీచ్ దగ్గర తాను మద్దతు ఇచ్చిన నిరసనను ఏపీ సర్కారు నిలువరించిందో.. అదే ప్లేస్ లో దాదాపు నెలన్నర ముందే నిరసనను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీ యువత నిర్వహించాలని భావించిన నిరసనను పోలీసులు అడ్డుకున్న వేళ.. పార్టీ పరంగా నిరసన సభను నిర్వహించాలని పవన్ డిసైడ్ చేశారు.

తరచూ తన ప్రసంగాల్లో ప్రస్తావించే దక్షిణాది వర్సెస్ ఉత్తరాది అంశంతో ఈసారి నిరసన సభను పవన్ ఏర్పాటు చేయటం గమనార్హం. దక్షిణాది వారి హక్కుల్ని ఉత్తరాది వారు కాలరాయటాన్ని అదే పనిగా పవన్ ప్రస్తావిస్తున్నారు. తాజాగా అదే అంశాన్ని అజెండాగా తీసుకొని సభను నిర్వహించే వరకూ వెళ్లటం గమనార్హం.

తాజాగా పవన్ తన ట్వీట్ లో ఈ విషయాన్ని పేర్కొంటూ.. ‘‘మొన్న తమిళనాడులో జల్లికట్టు ఉద్యమకారుల మీద పోలీసులు జరిపిన దాడి.. నిన్న ఆంధ్రాలో పార్లమెంటుసాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని మాట తప్పిన కేంద్రప్రభుత్వంపై శాంతియుత నిరసనకు వెళుతున్న విద్యార్థుల్ని.. యువతను పోలీసులు అరెస్ట్ చేయటం.. వారి ప్రాథమిక హక్కుల్ని కాలరాయటం.. దక్షిణ భారతీయులకు చాలా బాధ కలిగించింది. అందుకు నిరసనగా ‘దక్షిణ భారతీయుల ఆత్మ గౌరవ శాంతియుత నిరసన’ను వైజాగ్ లోని ఆర్కే బీచ్ ఒడ్డున మార్చిలో నిర్వహించటానికి నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. శుక్రవారం పవన్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా హోదాపై నిర్వహించాలనుకున్న శాంతి నిరసనను పోలీసులతో ప్రభుత్వం అడ్డుకోవటం ద్వారా తాత్కాలికంగా నిలువరించిందే తప్పించి అదేమీ శాశ్విత పరిష్కారం కాదని పేర్కొనటం.. అందుకు తగ్గట్లే.. నిరసన సభకు మరోసారి పిలుపు ఇవ్వటం గమనార్హం. ప్రజా ఆగ్రహాన్ని.. ఆవేదనను నిబంధనల పేరుతో ప్రభుత్వాలు ఎక్కువకాలం తొక్కేయలేవంటే ఇదేనేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News