పవన్ ఆ ముక్క ప్రకటిస్తే ఆత్మ హత్య లెక్కే!

Update: 2018-03-10 06:29 GMT
పవన్ కల్యాణ్ గుంటూరు వేదికగా చాలా భారీ స్థాయిలో బహిరంగసభను ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సభలో ఏం సచలనాలు నమోదు అవుతాయోనని రాజకీయ వర్గాలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎటూ ఇది ఎన్నికల ఏడాదే గనుక... భవిష్యత్తులో జనసేన ప్రస్థానం ఏ రకంగా సాగబోతున్నదనే విషయంలో పవన్ ఈ సభా వేదిక మీదనుంచి స్పష్టత ఇవ్వవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. ఆయన ఎన్ని ముచ్చట్లు - ప్రతిజ్ఞలు రెచ్చిపోయిన సవాళ్లు ఈ వేదిక మీదినుంచి చెప్పినా పర్లేదు గానీ.. ఒక్క విషయం చెబితే మాత్రం ఆత్మహత్య చేసుకున్నట్లే అవుతుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభ గుంటూరు లో 14వ తేదీన జరుగుతుంది. దీనికి రాష్ట్రంలోని 13 జిల్లాలనుంచి భారీ ఎత్తున జనాన్ని తరలించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. దాదాపుగా ప్రతినియోజకవర్గం  నుంచి కూడా ప్రాతినిధ్యం కనిపించేలాగా.. బస్సులను ఏర్పాటుచేసి.. కార్యకర్తలను సభకు తరలిస్తున్నారు. దాదాపు అయిదు లక్షల మంది సభికులు వచ్చేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు.

ఈ రేంజిలో సభా ప్లానింగ్ అంతా బాగానే ఉన్నది గానీ.. ఈ సభ రాష్ట్రప్రజలకు పవన్ కల్యాణ్ తరఫున ఏం సందేశం ఇవ్వబోతున్నది అనేదే కీలక చర్చనీయాంశంగా మారుతోంది. రాబోయే ఏడాదిలో ఎన్నికలను ఎదుర్కొనడానికి ఏయే పార్టీలతో పొత్తులు, ఏయే సీట్లనుంచి పోటీచేయబోయే వివరాలు పవన్ ప్రకటిస్తారని కొందరు ఊహిస్తున్నారు.

కానీ పొత్తుల ప్రకటన ఇప్పుడే ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి. దాని వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని.. వారి వ్యాఖ్య. ప్రకటించినా లేకున్నా.. పవన్ తెలుగుదేశం తో జట్టుకట్టి ఎన్నికల బరిలో ఉంటారనేది అందరికీ తెలిసిన సంగతే. కాకపోతే.. ఆయన ఈ మధ్య కాలంటో చంద్రబాబు లోపాలను ప్రస్తావిస్తూ.. ఆయనను కూడా తప్పుపడుతున్నందువలన.. కొందరు కొత్త అనుమానాలు పెంచుకుంటున్నారు. పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. ఏయే సీట్లలో పోటీచేస్తారనే సంగతిని పవన్ ప్రకటించారంటే గనుక.. అది ఆత్మహత్యతో సమానం అవుతుందని.. పలువురు విశ్లేషిస్తున్నారు. అలాంటి ప్రకటన వస్తే.. ఆయా ప్రాంతాల్లో ముఠా కుమ్ములాటలు పెరుగుతాయని.. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ పార్టీ సమాధి అయిపోతుందని.. పవన్ కల్యాణ్ మరీ అంత మూర్ఖంగా ప్రకటించక పోవచ్చునని ఊహాగానాలు నడుస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఏ సంగతి తేలుతుంది.
Tags:    

Similar News