విరాళాల‌లో కొత్త ట్రెండ్ సృష్టించిన ప‌వ‌న్‌

Update: 2018-10-30 15:23 GMT
జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు - సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విరాళాల స్వీక‌ర‌ణ‌లో కొత్త‌ ఒర‌వ‌డిని సృష్టించారు. త‌న మాతృమూర్తి కొణెదల అంజనాదేవి నుంచి ఆయ‌న విరాళం స్వీక‌రించారు. నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని ఆమె జనసేన పార్టీకి అందచేశారు. హైదరాబాద్‌ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారంనాడు ఈ మేరకు చెక్కును  పార్టీ అధ్యక్షుడు - త‌న కుమారుడు పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. ఈ సందర్భంగా అంజనాదేవి తనను కలసిన జనసేన పార్టీ ప్రతినిధులతో మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం గురించి - త‌మ జీవితంలో పోలీస్ ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్య‌త‌ల గురించి అంజ‌నా దేవి వివ‌రించారు.

పార్టీ కార్యాలయానికి వచ్చిన తన మాతృమూర్తికి పవన్ కళ్యాణ్ పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించి ఆమె పాదాలను తాకి నమస్కరించారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అంజనాదేవికి నమస్కరించగా త‌న‌ను ప‌రిచ‌యం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అంజ‌నాదేవి మాట్లాడుతూ నాదెండ్ల మ‌నోహ‌ర్ తండ్రి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు ఉత్తర్వు కారణంగా తన కుటుంబానికి కలిగిన మేలును గుర్తుచేసుకున్నారు. ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 55 సంవత్సరాలకు తగ్గించగా - నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి కాగానే వయోపరిమితిని 58 ఏళ్లకు పెంచారని - దీని కారణంగా తన భర్తకు మరో మూడేళ్ళ పాటు ప్రభుత్వానికి సేవలందించే అవకాశం కలిగిందని - ఇది తమ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగించిందని శ్రీమతి అంజనాదేవి తెలిపారు. పార్టీ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన శ్రీమతి అంజనాదేవి ఒక గంటసేపు గడిపారు.

పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమ - బాధ్యతతో కూడుకున్నదని అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని తన కుమారుడు పవన్ కళ్యాన్‌ ను అడిగినట్లు చెప్పారు. పోలీస్ ఉద్యోగం తనకు బాగా తెలుసునని - తన తాత బ్రిటిష్ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారని,తన తండ్రి ఎక్సయిజ్ శాఖలో సర్కిల్ ఇన్స్‌ పెక్టర్‌ గా పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసేవారిని చెప్పారు. తన తండ్రిగారి ఉద్యోగం రీత్యా తాము పశ్చిమ గోదావరి జిల్లాకు మారినట్లు తెలిపారు. ఎక్సయిజ్ శాఖలోనే కానిస్టేబుల్ గా పనిచేసే కొణెదల వెంకట్రావుగారితో తనకు వివాహం అయిందని - ఆ శాఖలో అనేక పదోన్నతలు పొంది అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ గా వెంకటరావు గారు రిటైర్ అయినట్లు అంజనాదేవి గుర్తుచేసుకున్నారు. త‌న భ‌ర్త‌ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్లే ఇప్పటికి తనకు పెన్షన్ వస్తుందని,ఆ పెన్షన్డబ్బుతోనే ఇప్పుడు పార్టీ కి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని అందచేసినట్లు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "ప్రభుత్వోద్యోగి కొడుకుగా నాకు పెన్షన్ విలువ తెలుసు. అందుకే ప్రభుత్వోద్యోగులు సి.పి.ఎస్. విధానం రద్దు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నాను. వారికి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాను" అన్నారు.

Tags:    

Similar News