ఏపీతో పాటు తెలంగాణ‌లో కూడా

Update: 2018-04-05 17:37 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు చేప‌ట్టనున్న పాద‌యాత్ర‌లో ట్విస్ట్ చోటుచేసుకుంది. న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ ప్ర‌యోజ‌నాలతో పాటుగా ...తెలంగాణ‌కు కూడా న్యాయం చేయాల‌ని ప‌వ‌న్ కొత్త డిమాండ్ తెచ్చారు. ఏపీతో పాటుగా తెలంగాణ‌లో కూడా పాద‌యాత్ర చేయాల‌నే నిర్ణ‌యం ఇందుకు నిద‌ర్శ‌నంగా పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కల్పనలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా సీపీఎం - సీపీఐ పార్టీలతో క‌లిసి పాదయాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను తాజాగా వెల్ల‌డించిన జ‌న‌సేన కొత్త స‌మాచారాన్ని పంచుకుంది.

శుక్రవారం ఉదయం విజయవాడలోని  బెంజి సర్కిల్ నుంచి ఈ మూడు పార్టీల పాద‌యాత్ర‌ ప్రారంభం అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ - సీపీఎం కార్యదర్శి పి.మధు - సిపిఐ కార్యదర్శి కె. రామకృష్ణ ఉదయం 10 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. బెంజ్ సర్కిల్ లో మొదలయ్యే ఈ పాదయాత్ర జాతీయ రహదారి మీదుగా రామవరప్పాడు వరకూ కొనసాగుతుంది. మార్గమధ్యంలో - పాదయాత్ర ముగిసిన తరవాత మీడియాను ఉద్దేశించి పై నాయకులు మాట్లాడుతారని జ‌న‌సేన తెలిపింది. జనసేన - సీపీఎం - సీపీఐ కార్యకర్తలు అసంఖ్యాకంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల‌ని కోరింది. పూర్తిగా శాంతియుతంగా ఈ కార్యక్రమం జరగడానికి ప్రతి ఒక్కరూ  సహకరించాలని కోరుతున్నామ‌ని పేర్కొంది.

అదే విధంగా విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని  తెలంగాణాలో జనసేన కార్యకర్తలు ఆ రాష్ట్రంలోని జాతీయ రహదారులపై పాదయాత్రలు జరపనున్నారని కొత్త అంశాన్ని జ‌న‌సేన వెల్ల‌డించింది. జాతీయ రహదారులు లేని ప్రాంతాల కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో పాదయాత్రలు జరుపుతారని పేర్కొంది. కాగా, తెలంగాణ కోసం కూడా పాద‌యాత్ర చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News