ఉత్త‌రాది అహంకారంపై ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్లు

Update: 2017-04-08 05:00 GMT
సామాన్యుల నోట త‌ర‌చూ వినిపించే నార్త్‌.. సౌత్ అనే మాట‌ల్ని రాజ‌కీయ నాయ‌కులు.. ప్ర‌ముఖులు పెద్ద‌గా ప్ర‌స్తావించిన దాఖ‌లాలు క‌నిపించ‌వు. ఆ కొర‌త తీరుస్తూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్పుడ‌ప్పుడు త‌న మాట‌ల‌తో ఈ వాద‌న‌ను తెర‌పైకి తెస్తుంటారు. విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌కుండా మాయ చేసిన మోడీ స‌ర్కారు తీరుపై ఇప్ప‌టికే ప‌లుమార్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా.. ఉత్త‌రాది.. ద‌క్షిణాది అంటూ ఆయ‌న వ్యాఖ్య‌లు చేయ‌టం.. దీనిపై కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు ఖండించ‌టం చూస్తున్న‌దే.

తాజాగా బీజేపీ మాజీ ఎంపీ త‌రుణ్ విజ‌య్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ అనూహ్యంగా స్పందించారు. ద‌క్షిణాది వాళ్లంతా న‌ల్ల‌గా ఉంటారంటూ ఆయ‌న నోటి వెంట వ‌చ్చిన వ్యాఖ్య‌ల‌కు అధినేత‌లు ఎవ‌రూ స్పందించ‌కున్నా.. ప‌వ‌న్ మాత్రం అగ్గి ఫైర్ అయిపోయారు. ద‌క్షిణ భార‌తం నుంచి  ఎంత తీసుకున్నారు.. ఎంత తిరిగి ఇచ్చారంటూ సూటి ప్ర‌శ్న‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసుకొని ట్వీట్ సంధించిన ఆయ‌న‌.. మ‌రిన్ని నిప్పులు చెరిగే వ్యాఖ్య‌ల్ని చేశారు.

న‌ల్ల‌గా ఉన్న ద‌క్షిణ భార‌తీయులు ఇచ్చే ఆదాయం కావాలి మీకు.. కానీ వాళ్ల మీద చిన్న‌చూపు మీకు.. ఈ ర‌క‌మైన భావ‌జాలం ఉన్న వ్య‌క్తులు వాళ్ల‌కు చోటు ఇచ్చే పార్టీలు జాతీయ‌స్థాయిలో ఉండ‌టం మ‌న దౌర్భాగ్య‌మంటూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. న‌ల్ల‌గా ఉన్న‌వి వ‌ద్ద‌నుకుంటే కోకిల‌ను నిషేధించాల‌న్న ప‌వ‌న్‌.. "మీరు ఎగ‌రేసే జాతీయ ప‌తాకం ఒక ద‌క్షిణాది మ‌హ‌నీయుడి రూప‌క‌ల్ప‌నే. ఉత్త‌రాది అహంకారం మొత్తం మీ మాట‌ల్లోనే క‌నిపిస్తోంది. క్ష‌మాప‌ణ‌లు చెప్పినంత మాత్రాన మ‌ర్చిపోయే అవ‌మానం కాదిది" అంటూ తీవ్రంగా స్పందించారు. ట్వీట్ల‌తో త‌న భావాల్ని వ్య‌క్తీక‌రించిన ప‌వ‌న్ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో షేర్ చేసిన ఇమేజ్‌.. దానికి ఆయ‌న రాసిన రైట‌ప్ ఒక్క‌సారి ఉలిక్కిప‌డేలా చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు. మ్యాప్‌లో ద‌క్షిణాది ప్రాంతాన్ని మాత్ర‌మే షేర్ చేస్తూ.. దానికి రైట‌ప్ కింద "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా" అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఉత్త‌రాది అహంకారం మీద మాట్లాడిన ప‌వ‌న్‌.. తాజాగా ఈ తీరుపై త‌న రియాక్ష‌న్‌ను మ‌రో స్థాయికి తీసుకెళ్లిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News