తాను ఎలా సీఎం అవుతానో చెప్పిన ప‌వ‌న్‌

Update: 2018-05-22 16:08 GMT
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స్టాండ్‌ పూర్తిగా మార్చేసుకున్న‌ట్టు సాధార‌ణ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ఒక కులం బ‌లంతో ముందుకు వెళ్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దే ప‌దే త‌న‌కు కులం మ‌తం లేదంటూ తన‌పై కుల ముద్ర చెరిపేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే, నిజాలు దాస్తే దాగ‌వు క‌దా! క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ లాగే తాను కూడా ఒక ప్రాంతాన్ని, ఒక కులాన్ని బలంగా న‌మ్ముకున్న ప‌వ‌న్ వాటిని కాపాడుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారిపుడు. క‌ర్ణాట‌క ఫ‌లితాల‌తో ప‌వ‌న్‌కు ఒక క్లారిటీ వ‌చ్చిందట‌. అదేంటంటే... సీఎం కావాలంటే ఏపీలో 88 (175కు గాను) రావ‌క్క‌ర్లేదు అని కేవ‌లం 30 సీట్లు గెలిస్తే చాల‌ని ప‌వ‌న్ న‌మ్ముతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అందుకే ఇన్నాళ్లు డైల‌మాలో ఉన్న ప‌వ‌న్ క‌ర్ణాట‌క ఫ‌లితాల అనంత‌రం త‌న ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశార‌ట‌. అందులో భాగ‌మే వాయిదా వేసిన ఈ యాత్ర‌లు ఆఘ‌మేఘాల మీద ప్రారంభించడం.

అయితే ఈరోజు కాశీబుగ్గ‌లో ప్ర‌త్యేక హోదా కార్య‌క్ర‌మాలు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు సీఎం కావాల‌ని ఎంత బ‌లంగా ఉందో స్వ‌యంగా త‌న మాట‌ల్లోనే చెప్పాడు. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన పార్టీయే కారణమని చెప్పిన ప‌వ‌న్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హమీలను విస్మరించాయని విమర్శించారు. కానీ తాను మాత్రం ప్ర‌శ్నిస్తాన‌ని ఇచ్చిన‌ మాటను నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏమ‌న్నారంటే... *త‌న అభిమానులు - కార్య‌క‌ర్త‌లు జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడమే కాకుండా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓట‌రుతో జనసేనకు ఓటు వేయిస్తే తాను సీఎం అవుతానని* చెప్పారు. ఆయ‌న నోటి నుంచి ఈ మాట విన్న వెంట‌నే అక్క‌డున్న జ‌నం అవాక్క‌య్యార‌ట‌. ఎంత సీఎం కావాలని ఉంటే మాత్రం మ‌రీ ఇంత డైరెక్టుగా చెప్పాలా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎవ‌రైనా... మ‌న‌ పార్టీ అధికారంలోకి తేవాల‌ని చెబితే బాగుంటుంది కానీ ఇలా మ‌రీ డైరెక్టుగా అంద‌రూ వెళ్లి త‌న‌కు ఓటు వేసి సీఎం చేయ‌మ‌ని అడ‌గ‌డం ఏంట‌ని విస్తుపోతున్నారు. జ‌గ‌న్ తాను అధికారంలో వ‌స్తే ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారిస్తాను అన్న‌పుడు *ప్ర‌జాసేవ‌కు అధికార‌మే కావాలా?* అని విమ‌ర్శ‌లు చేసిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు త‌న సీఎం కావాల‌ని ఇంత బ‌హిరంగంగా చెప్ప‌డం విడ్డూరం.

ఈ సంద‌ర్భంగా మ‌రో షాకు కూడా ఇచ్చాడు ప‌వ‌న్‌. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు బీజేపీని ప‌ల్లెత్తు మాట అన‌ని ప‌వ‌న్ *బీజేపీని నిల‌దీసిన చ‌రిత్ర మాదే* అని చెప్ప‌డంతో ఒక్క‌సారిగా అంద‌రూ షాక్ తినే ప‌రిస్థితి.
Tags:    

Similar News