పవన్ ట్వీట్ పంచ్: రుషికొండకు 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తారా?

Update: 2023-04-14 15:20 GMT
జనసేన అధినేత ట్వీట్ పంచ్ విసిరారు. ఇటీవలకాలంలో కాస్తంత కామ్ గా ఉన్న ఆయన తాజాగా పోస్టు చేసిన ట్వీట్ తో మళ్లీ తెర మీదకు వచ్చారు. ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టటం.. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాల్లో బిజీ కావటం.. మళ్లీ రాజకీయాల వైపు ఒక చూపు చూసి.. మళ్లీ వెనక్కి వెళ్లి తన పని చేసుకోవటం లాంటి వాటితో రెండు పడవల మీద జర్నీ చేస్తూ.. రెండింటిని బ్యాలెన్సు చేసే ప్రయత్నం చేయటం తెలిసిందే. అయితే.. దాని ఎఫెక్టు అంతగా లేదన్న విమర్శలు వినిపిస్తాయి.

ఇప్పటి పవన్ కల్యాణ్ మాదిరే.. అప్పట్లో టీఆర్ఎస్ అధినేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించే వారు. అప్పట్లో ఉద్యమం ఒక దారి తెన్నులేకుండా సాగేది. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చేవారు కాదు.

దీంతో.. తెలంగాణ ఉద్యమ కాడిని కేసీఆర్ కిందకు పడేశారన్నప్రచారం జోరుగా సాగేది. ఆయనకు కమిట్ మెంట్ పెద్దగా లేదన్న ప్రచారం సాగేది. సరైన అదును కోసం చూసేవారు. ఆ విషయం తర్వాతి రోజుల్లో ఆయన కదిపిన పావుల్ని చూసినప్పుడు అర్థమైంది.

ఇప్పుడు పవన్ పరిస్థితి కూడా అలాంటిదే. ఇప్పటికిప్పుడు ఆయన ఎంత జనసామ్యంలోకి వచ్చినా.. ఆయన ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే. దానికి బదులు.. సినిమాలు చేయటం ద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకోవటంతో పాటు.. ఎన్నికల సమయానికి అవసరమైన నిధుల్ని సిద్ధం చేస్తున్నారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఈ కారణంతోనే.. ఆయన రోజువారీ కార్యక్రమాల్ని నిర్వహించకుండా.. తాను ముందుగా సిద్ధం చేసుకున్న క్యాలెండర్ కు తగ్గట్లుగా పవన్ బయటకు వస్తున్నారని చెప్పాలి.

తాను ఎప్పుడైనా బయటకు రావాలనుకున్నప్పుడు.. కాస్త ముందుగా సోషల్ మీడియాలో ట్వీట్లతో సందడి చేయటం.. క్రమపద్దతిలో వేడిని పెంచి తాను ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. అలాంటి ప్రణాళికలో భాగంగానే తాజా ట్వీట్ల హడావుడి మొదలై ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖ రుషికొండ తవ్వకాలను కప్పి పుచ్చుకునేందుకు 151అడుగుల స్టిక్కర్లను అంటిస్తరా? అంటూ వ్యంగ్య ట్వీట్ చేశారు.

చెట్లు.. కొండల్ని నరికేయటం.. తీర ప్రాంతాలు.. మడ అడవుల్ని పాడు చేయటం వైసీపీ పాలన లక్షణంగా విమర్శించారు. రుషికొండనుధ్వంసం చేయటంలో వైసీపీ సర్కారు నిబంధనల్ని ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్దారించినట్లు పేర్కొన్నారు.

ఇదంతా చెబుతూ.. తాను సంధించిన ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా? లేదంటే రుషికొండ గ్రీన్ మ్యాట్ మీద 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తారా? అంటూ పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Similar News