నా పొత్తులు ప్ర‌జ‌ల‌తోనే.. ఎవ‌రితోనూ పొత్తులు లేవు: ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-06-19 14:52 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో త‌న పొత్తులు ప్ర‌జ‌ల‌తోనేనని.. మ‌రెవ‌రితోనూ త‌న‌కు పొత్తులు లేవ‌ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇది పొత్తుల కోసం మాట్లాడే స‌మ‌యం కాద‌ని తెలిపారు. ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరులో జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌లో జూన్ 19న ఆదివారం ప‌వ‌న్ మాట్లాడారు. పంట‌లు పండ‌క‌, గిట్టుబాటు ధ‌ర‌లు లేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతు కుటుంబాల‌కు ల‌క్ష చొప్పున ప‌వ‌న్ ఆర్థిక సాయం చేశారు. మొత్తం 80 కుటుంబాల‌కు ల‌క్ష రూపాయ‌లు చొప్పున అందించారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పై ప‌వ‌న్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. సీబీఎన్ (చంద్ర‌బాబు నాయుడు) ద‌త్త‌పుత్రుడిని తాను కాద‌ని.. సీఎం జ‌గ‌న్ మాత్రం సీబీఐ ద‌త్త‌పుత్రుడేన‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తులో జ‌గ‌న్ సీబీఐ కేసులు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని చెప్పారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోలేద‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. 2019లో వైఎస్సార్సీపీని న‌మ్మిన ప్ర‌జ‌లు ఈసారి ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ఓటేస్తార‌ని తేల్చిచెప్పారు.

వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం కౌలు రైతుల‌కు గుర్తింపు కార్డులు ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చ‌నిపోయిన ప్ర‌తిరైతుకు బీమా ప‌థ‌కం వ‌ర్తింప‌జేయాల‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌న్నింటినీ విస్మ‌రించార‌ని.. దేనినీ ప‌రిష్క‌రించ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌డంలో వైఎస్సార్సీపీ నేత‌లు ఆరితేరార‌ని విమ‌ర్శించారు. ప్ర‌శ్నించిన‌వారిపై వైఎస్సార్సీపీ నేత‌లు దాడులు చేస్తున్నార‌ని ధ్వ‌జమెత్తారు. వైఎస్సార్సీపీ నేత‌లు అధికార మ‌దంతో కొట్టుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే వారిని వైఎస్సార్సీపీ నేత‌లు బూతులు తిడ‌తార‌ని నిప్పులు చెరిగారు.

2014లోనే తాను వ‌చ్చి ఉంటే ప్ర‌జ‌ల‌కు ఇలాంటి క‌ష్టాలు వ‌చ్చేవి కాద‌ని ప‌వ‌న్ తెలిపారు. ఈసారి ప్ర‌జ‌లు త‌న‌ను ఆశీర్వదించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తాను ప్ర‌జ‌ల‌తోనే ఉన్నాన‌ని.. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచాల‌ని కోరారు. ప్ర‌జ‌ల ఆశీర్వాదాలు త‌న‌కు కావాల‌ని.. ఒక్క‌సారి జ‌న‌సేన పార్టీ వైపు చూడాల‌ని విన్న‌వించారు. ద‌స‌రా పండుగ త‌ర్వాత రోడ్ల‌పైకి వ‌స్తాన‌ని.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తాన‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.

కాగా జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర కోసం ప‌వ‌న్ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యానికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో ఏటుకూరు, లాలుపురం, యుద్ధ‌న‌పూడి, చిల‌క‌లూరిపేట మీదుగా ప‌వ‌న్ ప‌ర్చూరు చేరుకున్నారు. దారిపొడ‌వునా యువ‌త‌, మ‌హిళ‌లు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రోడ్ల‌న్నీ ప‌వ‌న్ నామ‌స్మ‌రణ‌తో ద‌ద్ద‌రిల్లాయి.
Tags:    

Similar News