పవన్ మాటలకు అర్ధాలు వెతికే పనిలో వైసీపీ!

Update: 2023-04-17 19:15 GMT
పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. ఆయన చేసే ప్రకటనలు ఇచ్చే స్టేట్మెంట్స్ కి కచ్చితంగా అర్ధాలు పరమార్ధాలు అనేకం ఉంటాయనే అంటారు. పవన్ కి రాజకీయాలు తెలియవు అన్నది ఒకప్పటి మాట. ఆయనకు రాజకీయం బాగా వంటబట్టింది అన్నది తాజా మాట. పవన్ రెండు చోట్లా తాను ఓటమి పాలు అయి కూడా పార్టీని ఈ రోజు వరకూ నడుపుకుని రావడంలోనే రాజకీయం ఉంది అంటున్నారు.

మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ తెలంగాణాకు మద్దతుగా తాజాగా మాట్లాడారు. తెలంగాణా సమాజానికి ప్రజలకు ఏపీకి చెందిన వైసీపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. దీని మీద ఇపుడు తెలంగాణాతో పాటు ఏపీలో సైతం చర్చ సాగుతోంది. నిజానికి వీర తెలంగాణా వాదాన్ని అందిపుచ్చుకున్న బీయారెస్ సైతం అనని విధంగా పవన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.

తెలంగాణా మంత్రి హరీష్ రావు వర్సెస్ ఏపీ వైసీపీ మంత్రుల మధ్య ఇటీవల మాటల యుద్ధం సాగింది. వారూ వీరూ గట్టిగానే అనుకున్నారు. ఇందులో రాజకీయ దుమారాన్నే అంతా చూశారు, కానీ తెలంగాణా ప్రజలకు అవమానం జరిగిందన్నది మాత్రం జనసేన అధినేత పవన్ గుర్తించారు. ఆయన దాని మీద కాస్తా ఆలస్యంగానే రియాక్ట్ అయ్యారు. మీరూ మీరు వంద అనుకోండి మధ్యలో తెలంగాణా ప్రజలను ఎందుకు అవమానిస్తారు. వారిని విమర్శించే అవసరం ఏంటి అని వైసీపీ మంత్రులు నేతల మీద పవన్ ఫైర్ అయ్యారు.

తక్షణం తెలంగాణా సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని  ఆయన కోరుతున్నారు. దీని మీద వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగానే రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తాము ఎవరినీ ఏమీ అనకుండానే అంటున్నట్లుగా భావించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమేంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆ మాటకు వస్తే పవన్ ఈ కొత్త బంధాలను ఎపుడు కుదుర్చుకున్నారని కూడా ప్రశ్నించారు.

ఉమ్మడి ఏపీని రెండుగా విభజిస్తే సహించలేకపోయానని, పదకొండు రోజుల పాటు అన్నం తినడం మానేశాను అని పవన్ అప్పట్లో ఒక సభలో అన్న మాటలను వీడియో క్లిప్పింగ్ ని  ఆయన ప్రెస్ మీట్ లో ప్లే చేసి చూపించారు. అంతే కాదు తెలంగాణా నుంచి ఆంధ్రా వారిని అక్కడి నేతలు తిడుతూ ఉంటే పౌరుషం లేదా మనకు ఎందుకు మన వాళ్ళు రియాక్ట్ కారు అని మరో సందర్భంలో ఒక సభలో పవన్ అన్న మాటలనూ ఆయన ప్లే చేశారు.

నాడు అలా అన్న పవన్ ఇపుడు ఇలా తెలంగాణాకు క్షమాపణలు చెప్పాలని ఎందుకు అంటున్నారో ఆయనే చెప్పాలని అన్నారు. అనని మాటలను కూడా అన్నామని ఆరోపిస్తూ ఆయన ఎందుకు బాధపడుతున్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు. హరీష్ రావుని అంటే ఈయనకు ఎందుకు కోపమని కూడా ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా ఈ మధ్యలో ఒక తెలుగు పత్రికలో బీయారెస్ తో జనసేన అవగాహన అంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఏపీలో బీయారెస్ జోరు చేయడం స్టీల్ ప్లాంట్ మీద ఉద్యమించడం వంటివి జరుగుతున్నాయి. ఏపీలో ఓట్ల చీలిక ఉండకూడదని పవన్ చంద్రబాబు చూస్తున్నారు.

ఇపుడు బీయారెస్ విషయంలో ఏమైనా కొత్త బంధాలకు ముడి పడుతోందా అన్న చర్చ అయితే రాజకీయంగా సాగుతోంది. అసలు పవన్ మాటల వెనక అర్ధాలు ఏంటి అన్నది వెతికే పనిలో వైసీపీ నేతలు ఉన్నారు. ఏపీలో బీయారెస్ ప్రెసిడెంట్ కూడా మాజీ జనసేన నాయకుడే అన్నది గుర్తు చేసుకుంటున్నారుట. చూడాలి మరి పవన్ మాటల వెనక ఏమైనా ఉందా అన్నది

Similar News