జీవితాంతం సమ్మెలో ఉండరు కదా? చర్చకు రావాల్సిందే కదా..

Update: 2022-01-25 04:28 GMT
మీరు మా పిల్లలు.. జీవితంతం సమ్మెలో ఉండరు కదా.. చర్చకు రావాల్సిందే.. పేర్ని వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పీఆర్సీ.. హెచ్ఆర్ఏ అంశంపై ఉపాధ్యాయులు.. ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. సమ్మెకు నోటీసులు ఇవ్వటం తెలిసిందే. ఈ వ్యవహారం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పు పడుతున్న ఉద్యోగులు.. ఇప్పటికే ప్రకటించిన పీఆర్సీని వెనక్కి తీసుకొని.. పాత జీతభత్యాల్ని చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. సమ్మెకు నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులు.. ఉద్యోగుల తీరును తీవ్రంగా తప్పు పడుతోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చిన ఆయన.. ఉద్యోగుల సమ్మెపై విలేకరులతో మాట్లాడారు.

సమ్మె నోటీసు ఇచ్చినా.. ప్రభుత్వ ఉద్యోగులు జీవితాంతం సమ్మెలోనే ఉండరు కదా? ఏదో ఒక రోజు ప్రభుత్వంతో మాట్లాడాల్సిందే కదా? చర్చకు రావాల్సిందే కదా? అందుకే.. వారికున్న అభ్యంతరాలు ఏమిటోప్రభుత్వం వద్దకువచ్చి మాట్లాడమని కోరుతున్నామన్నారు. ఉద్యోగులు ఇచ్చిన నోటీసుపై తమకు అభ్యంతరం లేదన్న ఆయన.. ‘‘నోటీసుతో వారు ఒక అడుగు ముందుకు వేసినా.. వారు మా పిల్లలే. ఎప్పటికి మా పిల్లలే. ప్రభుత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మనస్ఫూర్తిగా చర్చకు ఆహ్వానిస్తున్నా. ఏదో ఒక రోజు ప్రభుత్వంతో మాట్లాడాల్సిందే కదా?’ అని ప్రశ్నించారు.

ప్రభుత్వంతో చర్చకు రావాలే తప్పించి.. ఎక్కడో ఉండి మీడియాలో మాట్లాడటం.. దాన్నే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేయటం సమంజసం కాదన్నారు. మరి.. మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు.. చర్చకు రావాలన్న అంశంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News