తెలంగాణాలోనూ ఫోన్ ట్యాపింగా ?

Update: 2022-10-08 05:54 GMT
తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ కలకలం మొదలైంది. తమ ఫోన్లను కేసీయార్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపణలు చేశారు. మునుగోడు ఉపఎన్నికలకు, ఫోన్ ట్యాపింగుకు బండి ముడిపెట్టి ఆరోపణలు సంధించారు. చంద్రబాబునాయుడు హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అప్పట్లో వైసీపీ ఎంఎల్ఏలు చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే.

అలాగే ప్రతిపక్ష నేతలతో పాటు సమాజంలోని వివిధ రంగాల ప్రముఖుల మొబైల్ ఫోన్లను నరేంద్ర మోడీ సర్కార్ ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణలు అందరు వింటున్నదే. పలువురి మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయటానికి మోడీ సర్కార్ ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ సాఫ్ట్ వేర్ కొన్నట్లు కూడా ఆరోపణలు బాగా ఉన్నాయి. చివరకు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సూమోటోగా కేసు నమోదు చేసుకుని విచారణ కూడా జరుపుతున్నది.

పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇపుడు బండి పెగాసస్ సాఫ్ట్ వేర్ అని పేరు చెప్పకుండానే ఇజ్రాయెల్ నుండి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కొన్నట్లు ఆరోపణలు చేశారు. ఇజ్రాయెట్ టెక్నాలజీతో కేసీయార్ ఫోన్ ట్యాపింగుకు అవసరమైన ఒప్పందాలు చేసుకున్నట్లు సంజయ్ కలకలం రేపుతోంది.

మునుగోడు ఉపఎన్నికలో తమ వ్యూహాలను తెలుసుకునేందుకే కేసీయార్ తమ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నట్లు ఆరోపించారు. అయితే తన ఫోన్లో కూడా పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉన్నట్లు కేటీయార్ కూడా ఎదురు ఆరోపణలు చేశారు.

ఆరోపణలు చేశారుకానీ అందుకు తగ్గ ఆధారాలను మాత్రం చూపలేకపోయారు. ఆరోపణలు చేయటం ద్వారా బట్ట కాల్చి కేసీయార్ మొహం మీద విసిరేయటమే టార్గెట్ గా కనబడుతోంది. ఆరోపణలు చేసేటపుడే అందుకు తగ్గ ఆధారాలను కూడా సమర్పించాల్సిన బండి ఆపని మాత్రం చేయటంలేదు.

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పెగాసస్ ఆరోపణలు చేసినపుడు కొందరు ప్రతిపక్షనేతలు, జర్నలిస్టులతో పాటు కొందరు ప్రముఖులు తమ అనుమానాలను కూడా ఆధారాలతో ఫిర్యాదుచేశారు. కానీ ఇపుడు బండి మాత్రం కేవలం ఆరోపణలను మాత్రమే చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News