ఏపీ సీఎం జగన్ రిక్వెస్ట్ ని పీఎం పెద్దగా పట్టించుకోలేదా...?

Update: 2022-11-12 07:16 GMT
విశాఖ వేదిక మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక విన్నపాలు చేశారు. విభజన గాయాలతో కునారిల్లిన రాష్త్రం ఏపీ అని చెప్పారు. దయతలచి కేంద్రం  ఏమిచ్చినా గుర్తుపెట్టుకుంటామని అన్నారు. ప్రత్యేక హోదా సహా విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ వంటి విషయాలను ఆయన ప్రస్తావించారు. ఆ తరువాత మాట్లాడిన ప్రధాని మోడీ వీటి మీద సానుకూలంగా స్పందిస్తారు అని అంతా అనుకున్నారు.

కానీ ప్రధాని తన గంగా ప్రవాహం లాంటి స్పీచ్ తో అనుకున్నది తాను చెప్పదలచుకున్నది చెప్పేసి ముగించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆయన వల్లె వేశారు. దేశమంతా అమలవుతున్న పధకాలు, ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చారు. కానీ ఏపీ సీఎం జగన్ అడిగిన వాటిని ఆయన అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరీ ముఖ్యంగా విశాఖ వేదిక మీద మాట్లాడిన ప్రధాని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏదో చెబుతారు అని అంతా అనుకున్నారు. కానీ అది అసలు ఆయన నోటి వెంట రానే లేదు. దాదాపుగా ఎనిమిది వందల రోజులుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమిస్తున్న అతి ముఖ్యంలో అదే విశాఖ వచ్చిన ప్రధాని ఆ ఊసే ఎత్తకపోవడం దేనికి సంకేతం అంటే జవాబు చెప్పే వారు ఏరీ.

ఇక విశాఖకు ప్రత్యేక హోదా అని ఎన్నో సార్లు నోళ్లు  నొప్పిపెట్టేలా అడిగినా కూడా ప్రధాని ఆ మాటే ఎత్తకూడదని నిర్ణయించుకున్నారో ఏమో కానీ దాన్నికి కూడా పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి కేంద్రం ఈపాటికి జాతికి అంకితం చేయాల్సిన ప్రాజెక్ట్. దానికి ఈ రోజు దాకా అతీ గతీలేదు. అలాగే అమరావతి ఏకైక రాజధాని అని ప్రకటించాలని చాలా మంది కోరారు. అసలు ఏపీ రాజధానిని నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది.

కానీ ఆ విషయమూ ప్రధాని ప్రసంగంలో లేదు. ఆయన చెప్పినదల్లా ఏపీ జనాలు మంచి వారూ అని. తెలుగు వారు అభివృద్ధి సాధిస్తారు అని. ఇలాంటి ముచ్చట్లు చాలా చెప్పి ఉబ్బించేసి ప్రధాని తన ప్రసంగం అయిందనిపీంచారు. ఏపీ సీఎం విషయానికి వస్తే ఆయన తన ఏడు నిముషాల ప్రసంగంలో కొన్ని నిముషాలు  మాత్రమే ఏపీ సమస్యలకు కేటాయించారు . వాటిని అన్నింటికీ కట్టకట్టి మరీ ప్రధానికి చెప్పేసి తన బాధ్యత అయిందనిపించుకున్నారు.

దానికి ప్రధాని సైతం అంతే ధీటుగా వీటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అన్నట్లుగా స్పీచ్ ఇచ్చేసి ఊరుకున్నారు. ఎదురుగా లక్షల మంది జనం, వారి ముందు ఒక సీఎం అడిగినా ప్రధాని కనీసంగా ప్రస్థావించలేదు ఏ సమస్య మీద పరిష్కారానికి హామీ ఇవ్వలేదు అంటే అపీ అంటే లైట్ తీసుకున్నారా అన్న చర్చ అయితే వస్తోంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News