మోడీజీ.. ఇప్పుడు కూడా అడ‌వికి వెళ్లిరండి సార్!

Update: 2019-01-24 05:10 GMT
ప్ర‌ధాని మోడీ మాట‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. వెన్న రాసిన దోసెను స‌రైన రీతిలో కాలిస్తే ఆ రుచి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఆ దోసెకు త‌గ్గ‌ట్లు రెండు ర‌కాల చ‌ట్నీలు అందుబాటులో ఉంటే.. ఈ జీవితానికి ఇంకేం అవ‌స‌రం లేద‌న్న‌ట్లుగా ఉంటుంది. స‌రిగ్గా.. మోడీ మాట‌లు వింటే.. ఇలాంటి పెద్ద మ‌నిషి నాలుగు కాలాల పాటు అధికారంలో ఉంటే ఎంత బాగుణ్ణు అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

మ‌రి.. మోడీ మాష్టారి హామీలు.. తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ఇచ్చిన మాట‌.. ప్ర‌త్యేక హోదా మీద ప్లేటు ఫిరాయింపులు.. వ్య‌వ‌స్థ‌ల మీద ఉక్కుపాదం మోప‌టం.. ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించ‌టం.. త‌న‌కు న‌చ్చ‌నోడు సీబీఐ డైరెక్ట‌ర్ అయినా స‌రే పోస్టింగ్ విష‌యంలో చుక్క‌లు చూపించ‌టం.. అర్థ‌రాత్రి వేళ పోస్టు పీకి పారేసి.. కొత్తోళ్ల‌ను పెట్టేసి రాత్రికి రాత్రి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌టం లాంటివెన్నో చ‌ప్పున గుర్తుకు వ‌చ్చినంత‌నే మోడీ మాట‌ల్లోని మ‌ర్మం కొంత అర్థ‌మ‌వుతుంది.

తాజాగా మోడీ మాష్టారు చెప్పిన మాట‌ల్ని అంద‌రూ వినాల్సిందే. త‌న‌ను తాను తెలుసుకోవ‌టం కోసం ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు అంద‌రికి స్ఫూర్తి క‌లిగించేవే. ఇంకా చెప్పాలంటే కొత్త ఆలోచ‌న‌ల‌కు మొగ్గ తొడిగేలా ఆయ‌న మాట‌లు ఉంటాయి. కానీ.. ఎవ‌రూ కూడా చేయ‌కూడ‌ని ప‌నేమిటంటే.. మోడీ మాట‌ల్ని.. ఆయ‌న చేత‌ల్ని ఒక‌టిగా భావించ‌కూడ‌దు. ఒక‌వేళ అలా చేస్తే.. అంత‌కు మించిన త‌ప్పు మ‌రొక‌టి ఉండ‌దు.

ముంబ‌యికి చెందిన కొంద‌రు క‌థార‌చ‌యిత‌లు ఏర్పాటు చేసిన సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు. క‌థా ర‌చ‌యిత‌ల‌కు అవ‌స‌ర‌మైన ముడిస‌రుకును త‌న మాట‌ల‌తో త‌న జీవితాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశార‌ని చెప్పాలి.

ఇంత‌కీ మోడీ మాస్టారు చెప్పిన మాట‌ల్లో కీల‌కాంశాల్ని చూస్తే.. ఆయ‌న య‌వ్వ‌నంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తి దీపావ‌ళికి అయిదు రోజుల పాటు ఎవ‌రికి క‌నిపించేవారు కాద‌ని.. అడ‌విలోకి వెళ్లేవాడిన‌ని చెప్పారు. చాలామందికి ఆ విష‌యం తెలీద‌ని.. ఎక్క‌డికి వెళుతున్నావంటే..త‌న‌ను తాను తెలుసుకోవ‌టానికి అని చెప్పేవాడిన‌ని చెప్పారు.

మ‌నుషులు ఎవ‌రూ ఉండ‌ని అడ‌విలోకి వెళ్లేవాడిన‌ని.. మంచినీరు దొరికే ప్ర‌దేశాన్ని చూసుకునేవాడిన‌ని.. ఐదు రోజుల‌కు స‌రిప‌డా ఆహారాన్ని త‌న‌తో పాటు అడ‌విలోకి తీసుకెళ్లేవాడిన‌ని చెప్పారు. ఆ ఐదు రోజుల్లో ఆత్మ ప‌రిశీల‌న చేసుకునేవాడిన‌ని.. త‌న మాదిరే ఉరుకులు.. ప‌రుగుల‌తో జీవితాన్ని గ‌డిపే యువ‌త ఒక స‌మ‌యంలో ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఆత్మ ప‌రిశీల‌తో ఆలోచ‌న ధోర‌ణి మారుతుంద‌ని.. వాస్త‌విక ప్ర‌పంచంలో జీవించ‌టం ప్రారంభిస్తార‌ని..వెలుగు కోసం వెత‌కాల‌ని.. అది మీలోనే ఉంద‌ని చెప్పిన మోడీ మాస్టారు.. ప్ర‌ధాని పోస్టులోకి వ‌చ్చాక టైట్ షెడ్యూల్ లోకి వెళ్లిపోయిన మోడీ త‌న‌ను తానుతెలుసుకోవ‌టానికి.. తాను దేశానికి ఏం చేయాల‌న్న ఆలోచ‌న‌లతో తాను ఉండేవాడిని.. ఇప్పుడు తానేం చేస్తున్న‌ట్లు? అన్న విష‌యంపై ఒక్క‌సారి ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకుంటే బాగుంటుందేమో?

అంద‌రికి స‌ల‌హాలు ఇస్తున్న మోడీసాబ్‌.. ఒక్క‌సారి త‌న‌ను తాను ప‌రిశీల‌న చేసుకోవ‌టం.. త‌న‌కు తానే స‌ల‌హాలు ఇచ్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎన్నిక‌ల వేళ దేశ ప్ర‌జ‌ల‌కు.. మ‌రీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి ప్ర‌త్యేకంగా ఇచ్చిన హామీలు.. ఆ త‌ర్వాతి కాలంలో వాటిని అట‌కెక్కించిన వైనాన్ని గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో. ముంగిట్లోకి సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్న వేళ‌.. మోడీసాబ్ నాలుగు రోజుల పాటు ఏదో అడ‌వికి వెళ్లి వ‌స్తే బాగుంటేదేమో? ఇప్పుడున్న వేళ‌లో మోడీకి అత్యంత అవ‌స‌ర‌మైన‌ది ఆత్మ ప‌రిశీల‌నే. ఆ విష‌యాన్ని ఆయ‌న గుర్తించారా?


Full View

Tags:    

Similar News