మోడీ పేరుతో ట్రంప్ ఎంత అతిగా వ్యాఖ్య‌లు చేశారంటే?

Update: 2019-07-23 05:16 GMT
అమెరికా అధ్య‌క్షులుగా ఎంతోమంది అధ్య‌క్షులుగా వ్య‌వ‌హ‌రించారు కానీ ట్రంప్ మాదిరి వ్య‌వ‌హ‌రించిన నేత‌లు స‌మ‌కాలీన కాలంలో ఎవ‌రూ లేర‌ని చెప్పాలి. కొంద‌రు అధ్య‌క్షులు యుద్ధ‌కాంక్ష‌తో అమెరికా ఆర్థిక ప‌రిస్థితిని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించిన‌.. ట్రంప్ మాదిరి వివాదాస్ప‌దం మాత్రం మ‌రెవ‌రూ కాలేద‌ని చెప్పాలి.

నోటికి క‌ళ్లెం లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం.. త‌న స్థాయికి ఏ మాత్రం సూట్ కాని వ్యాఖ్య‌లు చేసే ధోర‌ణి ట్రంప్ లో చాలా ఎక్కువ‌. తాజాగా ఇదే తీరుతో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని బ‌ద్నాం చేసేలా చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మోడీ పేరుతో ట్రంప్ చేసిన అతి వ్యాఖ్య‌ల‌పై భార‌త్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ట్రంప్ వ్యాఖ్య‌ల్ని ఖండించింది.

ఇంత‌కీ.. మోడీ ప్ర‌స్తావ‌న‌ను ట్రంప్ ఎందుకు తెచ్చార‌న్న‌ది చూస్తే.. తాజాగా పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడే సంద‌ర్భంలో ట్రంప్ గొప్ప‌లు చెప్పుకునే క్ర‌మంలో క‌శ్మీర్ అంశాన్ని ప్ర‌స్తావించారు.

రెండు వారాల క్రితం భార‌త ప్ర‌ధాని త‌న‌ను క‌లిసిన స‌మ‌యంలో క‌శ్మీర్ అంశంలో త‌న‌ను మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించాల్సిందిగా కోరిన‌ట్లుగా ట్రంప్ వెల్ల‌డించారు. క‌శ్మీర్ దేశ అంత‌ర్భాగ‌మ‌ని.. దాని మీద ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేద‌ని.. స‌ల‌హాలు తీసుకోమ‌ని ఎంతోకాలంగా తేల్చి చెబుతున్న దానికి భిన్నంగా ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారంగా మారాయి.

ట్రంప్ వ్యాఖ్య‌ల్ని కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అలాంటి వ్యాఖ్య‌లేవీ మోడీ చేయ‌లేద‌ని స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. ఇందుకు సంబంధించి భార‌త విదేశీ వ్య‌వ‌హారాల అధికార ప్ర‌తినిధి ర‌వీశ్ కుమార్ వ‌రుస ట్వీట్లు చేస్తూ.. క‌శ్మీర్ పై ట్రంప్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయాల‌ని ప్ర‌ధాని మోడీ అస్స‌లు కోర‌లేద‌ని చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ తో వైట్ హౌస్ లో జ‌రిగిన స‌మావేశంలో మీడియాతో మాట్లాడే స‌మ‌యంలో ట్రంప్.. భార‌త ప్ర‌ధాని మోడీ నుంచి క‌శ్మీర్ విష‌యంలో ఒక విన్న‌పం వ‌చ్చినట్లు చెప్పారు. ఒక‌వేళ తానీ విష‌యంలో సాయం చేయాల్సి వ‌స్తే.. ఒక మ‌ధ్య‌వ‌ర్తిగా ఉండేందుకు తాను సంతోషిస్తాన‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News